కక్షపూరిత విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
* పి పి పి పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
* మెడికల్ కాలేజీలు పూర్తిచేసి, వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి
* వైసిపి అధినేత జగన్ పిలుపుమేరకు ర్యాలీ చేపట్టిన వైసిపి శ్రేణులు
* మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని వైసీపీ నాయకులు, విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. వైసిపి హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో ఏవీఎన్ కళాశాల నుంచి పూర్ణ మార్కెట్ వయా చౌట్రీ ఎమ్మార్వో ఆఫీస్ వరకు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కోలా గురువులు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్రాధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ వాసుపల్లి తో పాటు ర్యాలీలో పాల్గొని ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడంతో వీఆర్వోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందదని చెప్పారు. ఇంకా రోగనిర్ధరణ అలాగే ఇన్ పేషెంట్ మెడిసిన్స్ కి చార్జ్ చేస్తారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా మరో వైపు రాష్ట్రం పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పోతుందని తెలిపారు.
గత ఏడాది 750 ఎంబిబిఎస్ సీట్లు సమకూర్చాల్సి ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కక్ష పూర్తి విధానాలతో 700 సీట్లు కోల్పోయామని పేర్కొన్నారు.
2025 – 26 లో 1750 సీట్లు, అలా మొత్తం 2450 మెడికల్ సీట్లు మన పిల్లలు కోల్పోతున్నారని తెలియజేశారు.
1947 నుంచి 2022 వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా అభివర్ణించారు.
కూటమి ప్రభుత్వం పి పిపి పేరిట డ్రామాలు ఆడుతోందని ప్రజలకు అర్థమైందని వివరించారు.
వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలోనూ 7 మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తికాగా అయిదు కాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అని చెప్పారు. మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం దిగిపోయేసరికి వాటిలో దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులు జరిగినట్లు పేర్కొన్నారు.
కొత్త మెడికల్ కాలేజీల కోసం ఏటా రూ. 1000 కోట్ల చొప్పున అయిదు ఏళ్ళు వ్యయం చేస్తే చాలని, కానీ ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయకుండా, పి పి పి పేరుతో ప్రైవేటీకరణ పై
ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు.
వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా పూర్తిచేసి అన్నిటిని ప్రభుత్వం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వైసీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


