ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులకు శుభవార్త. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఈ నెల అక్టోబర్ 21 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబడగా, గతంలాగే జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి సేకరణ జరగనుంది.
ఈ ఏడాది పత్తికి క్వింటాలుకు రూ. 8,110 మద్దతు ధర (MSP) ప్రకటించగా, జిన్నింగ్ మిల్లులకు దూది బేల్‌కు రూ. 1,440 చెల్లించనుంది. రైతులు తమ పత్తి అమ్మకం కోసం స్లాట్ బుకింగ్ తప్పనిసరి. ఇందుకోసం ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి, అలాగే అమ్మకం ప్రక్రియను ‘సీఎం యాప్’ ద్వారా పూర్తి చేయవచ్చు. రైతులు తమ పంట వివరాలను గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో ముందుగానే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
CCI కొనుగోళ్లలో తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉండాలని నిబంధన విధించబడింది. తక్కువ ధరకు లేదా తక్కువ తూకంతో కొనుగోలు చేసే దళారులు, అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతులు ప్రభుత్వ ధరలకు మాత్రమే పత్తి అమ్మాలని సూచించారు. ఈ చర్యలతో రైతులకు సముచితమైన ధర లభిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.


