– కందుకూరి ఆశయ స్ఫూర్తిగా హితకారిణి సమాజం అభివృద్ధికి కృషి చేస్తాం : చైర్మన్ యాళ్ల
– ఘనంగా హితకారిణి సమాజం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం… అభినందన సభ
రాజమహేంద్రవరం నవంబర్ 06:
నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం పంతులు విద్య సంస్థల్లో చదువుకున్న వేలాది మంది ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉన్న స్థాయిల్లో ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. అసమానతలు లేని సమాజం కోసం, మహిళల విద్య, హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయ స్ఫూర్తిగా హితకారిణి సమాజం అభివృద్ధి కి నూతన కార్యవర్గం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ఎస్ కే వీటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గురువారం హితకారిణి సమాజం చైర్మన్ గా నియమితులైన డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ తో పాటు నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం సభ ఘనంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ వర్రీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య ఐక్యతను బలపరిచే విధంగా అన్ని దేవదాయ కమిటీలు వేస్తున్నామని,
మొట్టమొదటిసారిగా ఈ కార్యవర్గంలో ముగ్గురు రెల్లి కులస్తుల సభ్యులను నియామకం జరిపామన్నారు. సమాజం కోసం విలువైన ఆస్తులను త్యాగం చేసి కందుకూరి పంతులు సమకూర్చిన ఆస్తులను, విద్యా సంస్థలను గత వైసిపి పాలకులు విద్యాశాఖ, దేవదాయ శాఖల్లో అనాలోచితంగా విభజించారని, ఆ సంస్థల్లో పనిచేసే విద్యార్థులను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టారన్నారు. తమ ప్రభుత్వంలో ఈ వివాదాన్ని, ఇబ్బందులు తొలగించడానికి
నోడల్ అధికారిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిష్టాత్మకమైన, సమాజంలో గౌరవం కలిగిన హితకారిణి సమాజం ఆస్తుల పరిరక్షణకు, మౌలిక వసతులు అభివృద్ధికి, విద్యార్థుల, ఉద్యోగుల సంక్షేమానికి కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏకేసి కాలేజీ వద్ద ప్రతిష్టించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ఆ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ నగరంలో ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగిన ఎంతో మంది గొప్ప వ్యక్తులు సేవలు అందించిన హితకారిణి సమాజం పేరు ప్రఖ్యాతలు నిలబెట్టే విధంగా నేటి కార్యవర్గం పనిచేయాలని అన్నారు. గత పాలకులు సమాజం ఆస్తులను దుర్వినియోగం చేయడానికి యత్నాలు చేశారని విమర్శించారు.ప్రజల కోసం నిరంతరం ఆర్థిక, సామాజిక సేవలు అందించే తమ కుటుంబాన్ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామన్నారు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రెండోసారి అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, కందుకూరి ఆశయస్ఫూర్తిగా సమాజం సంస్థల అభివృద్ధికి తమ కార్యవర్గం పాటుపడుతుందన్నారు. ఇంకా ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, చల్లా శంకర్రావు, అత్తి సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, వై శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. నగర తొలి మహిళ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అభినందన సత్కారానికి ముందుగా యాళ్ల ప్రదీప్ తన నివాసం నుంచి భారీ ర్యాలీగా సభ వేదిక వద్దకు చేరుకున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


