**
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు గద్దె రామమోహన్ చేపట్టిన ఆందోళనలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నమోదు చేయించిన 27వ అక్రమ కేసును శుక్రవారం నాడు విజయవాడలోని ఎంపీ ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యే కోర్టు కొట్టివేసింది.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌పై స్పెషల్ కోర్టు ఫర్ ది ట్రయల్ ఆఫ్ క్రిమినల్ కేసస్ ప్రివేంటివ్ టూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ కోర్టులో నమోదైన కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. గతంలోనే వాదనలు విన్న న్యాయమూర్తులు శుక్రవారం తుది తీర్పును ఇస్తూ ఆ కేసును కొట్టి వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవలంబించిన అరాచక పాలన, ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఆందోళనలను అణిచి వేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిందన్నారు. వారి కేసులకు ఏమాత్రం బెదరకుండా ప్రజలతో కలిసి ఆందోళనలు నిర్వహించినట్లు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీకి ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ నాయకులను ప్రజలు భారీ మెజార్టీలతో గెలిపించారని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టించిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేయడం పట్ల గద్దె రామమోహన్ ఆనందం వ్యక్తం చేశారు.


