పుల్లంపేట, అక్టోబర్ 2(పున్నమి ప్రతినిధి)
నిరుపేదలకు ఇంటి స్థలాల కేటాయింపుపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జాగువారిపల్లి గ్రామ సచివాలయంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ మాట్లాడుతూ – “ఉడుమువారి పల్లి గ్రామంలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ వాగ్దానం నెరవేరలేదు. అందుకే మళ్లీ ఈరోజు గ్రామ సచివాలయంలో దరఖాస్తులు సమర్పించాము” అని తెలిపారు.పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ – “నిరుపేదల నుండి అందిన దరఖాస్తులను నాలుగు రోజుల్లో ఆన్లైన్ చేస్తాము” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పి.లక్ష్మీదేవి, లక్ష్మీ నరసమ్మ, గంగాదేవి, ఈశ్వరమ్మ, దేవి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.


