గృహాలు, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి.
– జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్ .వి .నరేష్ కుమార్.
విశాఖపట్నం అక్టోబర్
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ఇంటింటి చెత్త సేకరణలో ప్రజలు అవగాహన కలిగి భాగస్వామ్యంతో విశాఖ నగర అభివృద్ధికి, పరిసరాల పరిశుభ్రత కు ,పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ ప్రజలకు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నిత్యం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుండి వ్యర్ధాలను సేకరిస్తూ క్లాప్ వాహనాల ద్వారా తరలించడం జరుగుతున్నదని , ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నూరు శాతం నిర్వహించేందుకు జీవీఎంసీ నిరంతర చర్యలు చేపట్టిందన్నారు. నగరంలో నిత్యం 610 క్లాప్ వాహనాలు, 65 ఈ -ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడంతోపాటు 1100 డంపర్, కాంపాక్టర్ బిన్స్ సేకరణ తరలింపు ప్రక్రియ నిత్యం జీవీఎంసీ జరుపుతోందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి నిత్యం తమ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు సేకరించిన వ్యర్ధాలను అందించాలని, లేదా దగ్గర్లో ఉన్న డంపర్ బిన్ను, కాంపాక్టర్ బిన్ లలో వ్యర్ధాలను వేసి విశాఖ నగర పరిశుభ్రతకు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి తెలిపారు.
“ప్రజలు ముఖ్యంగా చేయవలసినవి”
*ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పచ్చ, నీలం, ఎరుపు రంగులు గల డస్ట్ బిన్లను కొనుగోలు చేసుకుని తడి, పొడి మరియు ప్రమాదకరమైన వ్యర్ధాలను వేరుచేసి నిత్యం జీవీఎంసీ క్లాప్ వాహనాలకు అందించాలి.
*ప్రతిరోజు ఉదయం మీ ఇంటి వద్దకు సేకరణకు వచ్చే వాహనానికి వ్యర్ధాలను తప్పనిసరిగా అందించాలి .
*వ్యర్ధాలు సేకరించే సమయాన్ని గమనించి ఆ సమయానికల్లా వ్యర్ధాలను అందించాలి.
*పారిశుద్ధ్య కార్మికుల కృషికి గౌరవిస్తూ సహకరించాలి.
“ప్రజలు చేయకూడని పనులు”
*రోడ్లపై, కాలువలలో , ఫుట్పాతులపై ,బహిరంగ ప్రదేశాలలో , ఖాళీ స్థలాలలో వ్యర్ధాలను పడవేయరాదు.
*మీ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను రాత్రిపూట బయట ఉంచరాదు.
*ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదు.
*పశువుల వ్యర్ధాలు, తడి వ్యర్ధాలు ఇతరుల ఇళ్ల ముందు, పరిసరాలలో వేయరాదు.
విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ జీవీఎంసీ కు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


