ఆత్మకూరులో టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
నెల్లూరు ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
- ఆత్మకూరు పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారెడ్డి గారి సూచనలతో జరిగింది.
వేడుకలు బిఎస్సార్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీతో ప్రారంభమయ్యాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దావా పెంచలరావు గారు మాట్లాడుతూ, “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతజాతికి ప్రతినిధి. ఆయనను కేవలం ఒక కులం, ప్రాంతం, వర్గానికి పరిమితం చేయడం సబబు కాదు. ఆయన సాంఘిక దురాచారాలను అధిగమించి, సమానత్వం కోసం పోరాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి” అని అన్నారు.
అంబేద్కర్ విద్యకు ప్రాధాన్యతనిచ్చిన మహానేత అని, చదువు ద్వారానే మనిషి ఎదుగుదల సాధ్యమని నమ్మారని తెలిపారు. విధానపరమైన అన్యాయాలను ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.