విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గ్రంథాలయ ఉద్యమం గురించి అంతా తెలుసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సామాజిక ఉద్యమాల్లో గ్రంథాలయ ఉద్యమం అత్యంత ప్రముఖమైనదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కోరుబిల్లి రాము అన్నారు. స్థానిక మల్కాపురంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన గ్రంథాలయ ఉద్యమంపై మాట్లాడుతూ – శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, కందుకూరి వీరేశలింగం, కొమర్రాజు లక్ష్మణరావు, గిడుగు రామ్మూర్తి పంతులు, ఎం. అనంత పద్మనాభం, గోరంట్ల వెంకటచలం మొదలైన వారు ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయ ఉద్యమానికి ఎంతగానో శ్రమించారని అన్నారు. గ్రంథాలయాలను స్థాపించడం, పుస్తకాలను సేకరించడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడం మొదలైన విషయాల్లో వారి కృషి గణనీయమైనదని, వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం అని అన్నారు. సమావేశానికి గ్రంథాలయాధికారి శ్రీ వి. అజయ్ కుమార్ అధ్యక్షత వహించి గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న వారి జీవిత చరిత్రలను తెలియజేశారు. అనంతరం బాలలకు దేశభక్తి గేయాలలో పోటీని నిర్వహించారు. తొలుత అంతా గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు.


