*అన్నవరం రైతుల సమస్యకు పరిష్కారం*
*ఇంటికో ఉద్యోగం, 6 సెంట్ల నివేశన స్థలం: గంటా*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* భీమిలి మండలంలోని అన్నవరం భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో మే ఫెయిర్, ఒబెరాయ్ వంటి ప్రముఖ హోటల్స్.. రిసార్ట్స్.. కు ప్రభుత్వం భూములు కేటాయించిన విషయం విదితమే. 28 మంది రైతులు ఒకొక్కరు 50 సెంట్లు చొప్పున దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నారు. ఆతిథ్య రంగానికి ప్రభుత్వం భూములిచ్చిన సమయంలో రైతులు ఆందోళన చేశారు. అయితే భూ సాగుకు సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులు లేకపోవడంతో రైతులకు పరిహారం చెల్లింపు సాధ్యపడదని అధికారులు అప్పట్లో తేల్చి చెప్పారు. దీంతో తమకు న్యాయం చేయాలని రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రైతులు ఎమ్మెల్యే గంటా ను మంగళవారం ఎం.వి.పి. కాలనీ లోని ఆయన నివాసంలో కలిశారు. రైతులు.. భీమిలి ఎమ్మార్వో పి.రామారావు, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, చిక్కాల విజయ్ బాబు లతో చర్చించిన తర్వాత ఒక్కో రైతుకు స్థానికంగా 6 సెంట్ల స్థలాన్ని, కుటుంబానికి ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు రైతులు సానుకూలంగా స్పందిస్తూ.. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న గంటా కు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టులో దాఖలు చేసిన కేసు విత్ డ్రా సహకరించడానికి రైతులు సుముఖత వ్యక్తం చేశారు.


