అనకాపల్లి, (చోడవరం) నవంబర్ 13: ఇటీవల చోడవరం, బుచ్చయ్యపేట, వి.మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో వరుసగా రాత్రి వేళల్లో దేవాలయాల్లో హుండీ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను చోడవరం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం 26 కేసుల్లో దొంగతనాలకు గురైన 10.32 గ్రాముల బంగారం, 26 తులాల వెండి, నగదు 44,218 రూపాయలు — మొత్తం 66,418 రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు పెద్దవాడు కాగా, మిగిలిన ముగ్గురు మైనర్లు.
నిందితులు జల్సాలకు అలవాటు పడి, దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని రాత్రి వేళల్లో హుండీలను దొంగిలించేవారు. నేర స్థలాల్లో లభించిన ఆనవాళ్ల ఆధారాలతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో విజయం సాధించారు.
నిందితులు:
1. రాసూరి పోతురాజు, తండ్రి అప్పారావు, 20 సంవత్సరాలు, బుడబుక్కల (ఎస్టీ), దొరబాబు కాలనీ, వడ్డాది గ్రామం, బుచ్చయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా.
మైనర్ నిందితులు (జువెనైల్):
1. బుచ్చయ్యపేట మండలం
2. బుచ్చయ్యపేట మండలం
3. బుచ్చయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా (పరారీలో ఉన్నాడు)
నిందితులు చెడు వ్యసనాలకు బానిసై ఈ హుండీ చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారం, వెండి, నగదులో కొంత ఖర్చు చేసి, మిగతా సొత్తును విజయరామరాజుపేట ప్రాంతంలో దాచి ఉంచారు. ఈ రోజు ముగ్గురు బైక్‌పై వడ్డాది నుండి చోడవరం వైపు వస్తుండగా చోడవరం పోలీసులు గౌరిపట్నం వద్ద వారిని పట్టుకున్నారు. వీరిలో మొదటి ముగ్గురు అన్ని కేసుల్లో పాల్గొనగా, నలుగవ వ్యక్తి ఒక కేసులో మాత్రమే పాల్పడ్డాడు.
కేసులు నమోదు అయిన పోలీస్ స్టేషన్లు:
చోడవరం – 2,
బుచ్చయ్యపేట – 11,
వి.మాడుగుల – 9,
చీడికాడ – 2,
దేవరాపల్లి – 2,
మొత్తం – 26 కేసులు.
ఈ కేసులను ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకత్వంలో, అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్. మోహనరావు పర్యవేక్షణలో, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి ఆధ్వర్యంలో చోడవరం ఇన్స్పెక్టర్ పి. అప్పలరాజు, ఎస్సై బి. నాగకార్తీక్, ఎస్సై బి. జోగారావు మరియు సిబ్బంది ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఛేదించారు. అధికారులు వారిని అభినందిస్తూ ప్రశంస పత్రాలు అందజేశారు.
ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ — ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించాలని సూచించారు. ఇళ్లలో విలువైన వస్తువులు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బయట ప్రాంతాలకు వెళ్ళేవారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్) సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రత లేని దేవాలయాల్లో విలువైన వస్తువులు, నగదు ఉంచరాదని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీలు ఎం. దేవ ప్రసాద్, ఎల్. మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి, చోడవరం ఇన్స్పెక్టర్ పి. అప్పలరాజు, ఎస్సై బి. నాగకార్తీక్, ఎస్సై బి. జోగారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


