అట్టహాసంగా పీఏసీఎస్ పదవీ ప్రమాణ స్వీకారం..
పొదలకూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) పీఏసీఎస్ చైర్మన్ గా తలచీరు మస్తాన్ బాబు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ కనీస వేతన బోర్డు సలహా కమిటీ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి లు పాల్గొన్నారు. వీరి సమక్షంలో మస్తాన్ బాబు పొదలకూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. అలాగే కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, గంట మల్లికార్జున్ యాదవులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పొదలకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ గజమాల తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా సొసైటీ చైర్మన్, డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన మస్తాన్ బాబు, పెంచల భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ లు రైతులతో సఖ్యతగా ఉంటూ వారి అభ్యున్నతి కోసం బాధ్యత గా పాటుపడాలని సూచించారు.


