ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
కలెక్టర్ గారూ.. ఆ రికార్డులు ఏమయ్యాయి?
వెలుగుమట్ల భూదాన్ భూములపై మాయాజాలం – సమాధానం ఎవరు చెప్పాలి
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇటీవల జరిగిన ఇండ్ల కూల్చివేతలు తీవ్ర వివాదానికి దారితీశాయి. గత నెల 24వ తేదీ నుంచి అధికారులు నిరుపేదల ఇండ్లను కూల్చివేయడంతో ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికారులు ఆ భూములు ప్రభుత్వ రెవెన్యూ భూములని పేర్కొంటుండగా, స్థానికులు మాత్రం అవి భూదాన్ భూములని చెబుతూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
భూదాన్ యజ్ఞం నుంచి ప్రారంభమైన కథ
దేశవ్యాప్తంగా భూమిలేని పేదలకు భూమి పంచేందుకు మహనీయుడు ఆచార్య వినోబా భావే ఇచ్చిన పిలుపు మేరకు 1954లో కల్వల రాజారావు కుటుంబం తమ సొంతమైన 62 ఎకరాల 16 గుంటల భూమిని భూదాన్ యజ్ఞానికి దానం చేసినట్లు చెబుతున్నారు. ఈ భూమి పేదలకు పంపిణీ కావాల్సి ఉన్నప్పటికీ, దాదాపు 72 సంవత్సరాలు గడిచినా పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలు
తెలంగాణ కాసర పహానీ రికార్డుల ప్రకారం 1984–85 వరకు వెలుగుమట్లలోని
– సర్వే నం.147లో 20.66 ఎకరాలు
– సర్వే నం.148లో 22.94 ఎకరాలు
– సర్వే నం.149లో 18.56 ఎకరాలు
మొత్తం ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డు పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే 1984 తర్వాత ఈ భూముల పరిస్థితి ఏమైందన్నది ఇప్పటికీ స్పష్టత రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
31.7 ఎకరాల భూమి ఏమైంది?
ప్రభుత్వ లెక్కల ప్రకారం వెలుగుమట్లలో సుమారు 31.7 ఎకరాల భూమి రూ.250 కోట్ల విలువైనదిగా పేర్కొంటున్నారు. అయితే మిగిలిన సుమారు 31 ఎకరాల భూమి ఏమైందన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది. ఈ భూములపై పేర్లు మార్పులు జరిగాయా? రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం భూములు కాజేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లెక్కల్లో మరో గందరగోళం
ఇంకొకవైపు “ప్రొహిబిటెడ్ ల్యాండ్స్” పేరుతో వెలుగుమట్లలో భూదాన్ భూములు 25.4 ఎకరాలే ఉన్నాయని మరో లెక్క వెలుగులోకి రావడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఈ లెక్క ప్రకారం మిగిలిన 5.6 ఎకరాలు ఎక్కడికి పోయాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిరుపేదల ఇండ్ల కూల్చివేతపై ఆగ్రహం
అధికారులు భూమి ప్రభుత్వానికి చెందినదని చెబుతూ నిరుపేదల ఇండ్లను కూల్చివేయడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రెక్కాడితే గానీ డొక్కాడని పేదల్ని రోడ్డు మీదకు నెట్టేయడం సరైందా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
బహిరంగ చర్చకు రావాలని డిమాండ్
ఈ వ్యవహారంపై జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, జిల్లా అధికారులు ప్రజల ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెలుగుమట్ల భూదాన్ భూముల అసలు స్థితిగతులపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని కూడా కోరుతున్నారు.
సమాధానం ఎవరు చెబుతారు?
భూదాన్ పేరుతో ఉన్న భూముల రికార్డులు ఎలా మారాయి? మిగిలిన ఎకరాలు ఎక్కడికి వెళ్లాయి? పేదల ఇండ్ల కూల్చివేత ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.
వెలుగుమట్ల భూముల కథ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పెద్ద చర్చగా మారింది. ఈ వివాదానికి తుది పరిష్కారం ఎప్పుడు వస్తుందో చూడాలి.

