విశాఖపట్నం సెప్టెంబర్ 9
పున్నమి ప్రతినిధి సూర్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 4, 2025న చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 17 కొత్త వైద్య కళాశాలలలో పదింటిని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడాన్ని రద్దు చేయాలని పిడిఎస్ఓ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వి. లక్ష్మి మాట్లాడుతూ “ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలలను 33 సంవత్సరాల లీజుకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ద్వారా 1500 ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితమవుతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటాను 50% తగ్గించి, 50% సీట్లను మార్కెట్ రేట్లతో విక్రయించడం వల్ల ఫీజులు అమాంతం పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం నాబార్డ్ నిధులతో 8500 కోట్లతో 17 కళాశాలల నిర్మాణానికి చొరవ తీసుకున్నప్పటికీ, 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 కళాశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం 2024లో పులివెందులను తిరస్కరించి, 80% నిర్మాణం పూర్తైన 10 కళాశాలల్లో ఎంబిబిఎస్ సీట్లను రద్దు చేయమని ఎన్ఎంసికి లేఖ రాసింది. ఇది పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం జీవో 107, 108 ద్వారా సెల్ఫ్-ఫైనాన్స్ కోటాను ప్రవేశపెట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఈ జీవోలను 100 రోజుల్లో రద్దు చేసి, 100% సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నీటిబుడగలయ్యాయి అన్నారు. 2027-28 నాటికి మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పులివెందుల కళాశాలలను పిపిపిలో ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఫీజులు ఏడాదికి 8 లక్షల వరకు, ఎంబిబిఎస్ కోర్సుకు అరకోటి రూపాయల వరకు ఖర్చవుతాయని, అదే ప్రభుత్వ కళాశాలలైతే 5 లక్షలతో సరిపోతుందని, ప్రభుత్వం పారదర్శకత లేకుండా, కన్సల్టెన్సీల ద్వారా కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలు పన్నుతోందని, చిత్తూరులో అపోలో సంస్థ ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగిస్తూ కొత్త ఆసుపత్రి నిర్మించకపోవడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులతో అరకొర వైద్యం అందడం సామాన్యులకు నష్టం కలిగిస్తోందన్నారు. ఈ పిపిపి మోడల్ విస్తరిస్తే అన్ని ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ప్రమాదం ఉందని, అందుకని పిడిఎస్ఓ ఈ నిర్ణయాలను ఖండిస్తూ 10 కళాశాలల పిపిపి నిర్ణయాన్ని ఉపసంహరించాలని” అన్నారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని రద్దు చేయాలని, జీవో 107, 108ను రద్దు చేసి 100% సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలని, 17 కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థులంతా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా కమిటీ సభ్యులు జానకి, లక్ష్మణ్, లోకేష్, లైకోన్, తులసి తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

