నెల్లూరు: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పి డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు కలిసి పట్టణం, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నేరాల నివారణ లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై నిరంతరం డ్రోన్ నిఘా కొనసాగుతోంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, రహదారి ప్రమాదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి పాడుబడిన భవనాలు, తోటలు, పార్కులు, నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. పట్టణ సమీప ప్రాంతాల్లో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
జిల్లాలో సాంకేతికత ఆధారంగా నేరాల నియంత్రణకు తీసుకుంటున్న ఈ వినూత్న చర్యలతో ప్రజలకు మరింత భద్రత కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు పోలీసులు ముందుకు సాగుతున్నారు.



