✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూ.గో.జిల్లా రాజమహేంద్రవరం దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిందే..
-కాంగ్రెస్ అఖిల పక్ష సమావేశంలో నాయకుల డిమాండ్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసేలా దేశంలో పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక ఎపి పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం అఖిల పక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకుడు టి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్, కెకె సంజీవరావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకుడు దేశిరెడ్డి బలరామ నాయుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తాళ్లూరి విజయకుమార్ సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేసారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరూ ఏ మతాన్నైనా అనుసరించే హక్కు ఉందని, మతం ప్రకారం రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమని తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించేలా చర్చించి రాజ్యాంగాన్ని సవరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. దేశవ్యాప్తంగా దీనిపై పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ఎవరికి అవకాశం ఉండకూడదన్నారు. మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాలనే నిర్ణయం తీసుకోవాన్ని పెద్ద కుట్రగా అభివర్ణించారు. దీనిపై తక్షణం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయించాలని డిమాండ్ చేసారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించే వరకు అఖిల పక్ష కమిటీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కూడా సమావేశంలో తీర్మానం చేసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్టిన్ లూథర్, డాక్టర్ వడయార్, బెజవాడ రంగారావు, వివిధ పక్షాల నాయకులు పవన్, కొండలరావు, కూండ్రపు రాంబాబు, పూర్ణిమారాజ్, సింధియా రాణి, శ్రీనివాస్, యాళ్ల వీరభద్రరావు, నిల్లా వీర్రాజు, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం, నల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు.



