మచిలీపట్నం (కోనేరుసెంటర్), న్యూస్‌టుడే:
కృష్ణా విశ్వవిద్యాలయంలో సోమవారం మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సమన్వయంతో నిర్వహించిన ఉద్యోగ మేళాకు మంచి స్పందన లభించింది. ఎనిమిది ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ మేళాలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 140 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఉపకులపతి ఆచార్య రాంజీ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఉష, ప్లేస్‌మెంట్ సెల్ సమన్వయకర్త సుందరకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
యూజీ ఫలితాలు విడుదల:
విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన యూజీ మూడో, ఐదో సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. మూడో సెమిస్టర్‌లో 51.85 శాతం, ఐదో సెమిస్టర్‌లో 66.31 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి పి. వీరబ్రహ్మాచారి తెలిపారు. ఫలితాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, పునర్మూల్యాంకనానికి జనవరి 7 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

