
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట అనగానే గుర్తొచ్చేవి కాళంగినది, ఆ నదీ తీరాన వెలసివున్న పరమ పావని శ్రీ చెంగాళమ్మ అమ్మవారు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాకెట్ కేంద్రం శ్రీహరికోట, అతి ప్రాచీనమైన మన్నారుపోలూరులోని రాజగోపాలస్వామి ఆలయం. తెలుగు, తమిళ సాంప్రదాయాల మేలుకలయిక సూళ్లూరుపేట. సుళ్ళూరుపేటకు చెంగాళమ్మ ఆలయం వల్ల ఈ పేరు వచ్చింది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతున్నది. ఈ విధంగా తిప్పడాన్ని ”సుళ్ళు ఉత్సవం” అంటారు. ఆ విధంగా ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని దర్శించుకొనేందుకు రోజూ 2 వేల మంది వస్తుంటారు. తడ : మనజిల్లాకు సరిహద్దు మండలం ‘తడ’. తడ వృక్షాలు ఎక్కువగా వున్న ప్రాంతం ‘తడ’గా పిలవబడింది. తడ అంటే ధన్వమనెడు చెట్టు. ధనుర్వుక్షం అని కూడా అంటారు. దీని కట్టెలు ఇండ్లకు, ఆకులు విస్తళ్లకు ఉపయోగిస్తారు. పెళ్ళకూరు : యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన ఒక వీరుని పేరు మీద ఏర్పడిన గ్రామం తాళ్వాయిపాడు. బండ్లమాంబ వారి చండికా పరమేశ్వరి ఆలయం, పాఠశాల ఈ మండలం ప్రత్యేకతలు.

