*సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు అందించిన గంటా రవితేజ*
*తుపాను నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్న యువనేత*
_*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*:_ సీఎం సహాయ నిధికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు, టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ రూ. 5 లక్షలు అందజేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో గురువారం కలిసి ఈ మేరకు చెక్కును అందించారు. మొంథా తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో గురువారం తన పుట్టినరోజు వేడుకలను రవితేజ రద్దు చేసుకున్నారు. బాధితులను ఆదుకోవడానికి తన వంతు బాధ్యతగా నియోజకవర్గంలో పార్టీ యువతతో వచ్చి ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. అనంతరం “గీత మకరందం” ఆధ్యాత్మిక గ్రంథాన్ని లోకేష్ కు బహూకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల గురించి లోకేష్ ఆరా తీశారు. భీమిలి టీడీపీకి కంచుకోటని, కె.ఎస్.ఎస్.లు.. కమిటీలు.. విజయవంతంగా పూర్తి చేశామని రవితేజ తెలిపారు. లక్ష పైగా పార్టీ సభ్యత్వాలు నమోదు చేసిన విషయాన్ని లోకేష్ కు వివరించారు. యువత భాగస్వామ్యంతో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రవితేజకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన లోకేష్.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు.


