*వారం రోజుల్లో పురోగతి కనిపించకపోతే సస్పెండ్ చేస్తా…*
*సాగర్ నగర్-1 సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఘాటు హెచ్చరిక
*విశాఖపట్టణం పున్నమి ప్రతినిధి * నిర్దేశించిన లక్ష్యాల మేరకు వారం రోజుల్లో పురోగతి కనిపించకపోతే సస్పెండ్ చేయక తప్పదని సచివాలయ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సాగర్ నగర్-1, 2 వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. పలు రికార్డులను పరిశీలించారు. సచివాలయం-1లో ప్రభుత్వ లక్ష్యాల మేరకు తగిన విధంగా పురోగతి లేకపోవడాన్ని గమనించిన ఆయన అసంతృప్తి చెందారు. సిటిజన్ సర్వే, ఈ-కేవైసీ చేయటంలో బాగా వెనుకబడి ఉన్నారని, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని నిలదీశారు. ఇంకా 400 మంది తాలూక ఈ-కేవైసీ పెండింగ్ ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వారం రోజుల సమయం ఇచ్చారు. ఈ వారం రోజుల్లో పురోగతి కనిపించకపోతే అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డుల నిర్వహణ, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అప్డేట్ గా ఉండాలని, ఎప్పటి పనే అప్పుడే పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు సచివాలయాల జిల్లా కో-ఆర్డినేటర్ ఉషారాణి ఉన్నారు.
@అనంతరం అదే కాంపౌండ్ లో ఉన్న యూపీహెచ్సీని సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను గమనించారు. అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సామాన్య ప్రజలతో మాట్లాడారు. రోజువారీ ఓపీ, సిబ్బంది హాజరు, ఇతర వివరాలపై అక్కడ అధికారులను ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన రీతిలో మెరుగైన సేవలందించాలని ఈ సందర్భంగా సూచించారు.


