5 లక్షల మంది సర్టిఫికేట్స్ పునఃపరిశీలన పూర్తి.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నోటీసులు జారీ వద్దు.
సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @
దివ్యాంగుల కేటగిరీ పింఛన్ దారులలో అనర్హులగుర్తింపునకు చేపట్టిన సదరం (వైకల్య నిర్ధారణ) పునఃపరిశీలనను వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఇప్పటికే అనర్హులుగా తేలి, అప్పీలు చేసుకున్న వారికి మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 7.38 లక్షల మంది దివ్యాంగ పింఛనుదారులుండగా ఇప్పటివరకు 5 లక్షల మంది ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన పూర్తయింది. ఇంకా 1.38 లక్షల మందికి వైకల్య పరీక్షలు చేయించాల్సి ఉంది. 8 నెలలుగా చేపట్టిన తనిఖీలో దాదాపు 1.35 లక్షల మంది అనర్హులుగా తేలారు. వీరిలో అర్హులుంటే అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. తాము అర్హులమేనంటూ 95 శాతం మంది ప్రభుత్వానికి అప్పీలు చేసుకున్నారు. వీరికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు.. ఇప్పటికే కొనసాగుతున్న పునఃపరిశీలనను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తదుపరి ఆదేశాలొచ్చే వరకూ కొత్తగా నోటీసులు ఇవ్వొద్దని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి.


