శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యం, పారదర్శకతను మెరుగు పరచాలనే లక్ష్యంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ కొట్టే సాయిప్రసాద్ గారు ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నప్రసాద కాంటీన్ ప్రాంతం, భద్రత సిబ్బంది విధులు, క్యూ లైన్ వ్యవస్థతో పాటు ఫోన్–బ్యాగ్ భద్రపరచే కౌంటర్లు వంటి కీలక ప్రాంతాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు.
ఇటీవలి కాలంలో ఫోన్ – బ్యాగ్ భద్రపరచే కేంద్రాల్లో అధిక రుసుములు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో, చైర్మన్ గారు అక్కడికే వెళ్లి వివరాలను సేకరించారు. భక్తులతో నేరుగా మాట్లాడి ఎలాంటి అసౌకర్యాలు ఎదురవుతున్నాయో తెలుసుకున్నారు.
నిఘా కేంద్రాలు కూడా పరిశీలన:
ఆలయంలో ఏర్పాటు చేసిన నిఘా కేంద్రాలను కూడా చైర్మన్ గారు తనిఖీ చేశారు. భద్రత, క్రమశిక్షణ, క్యూ లైన్ నియంత్రణ, మరియు దళారుల దూకుడును అరికట్టడంలో ఈ నిఘా కేంద్రాల పాత్రను సమీక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు.
“శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను. అధిక రుసుములు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ గారు భక్తులకు హామీ ఇచ్చారు.
ఆలయ పరిసరాల్లో పారదర్శకత, భక్తుల భద్రత, సౌకర్యం, సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ శ్రీ కొట్టేసాయి ప్రసాద్ గారు పేర్కొన్నారు.


