గాజువాక, నవంబర్ (పున్నమి ప్రతినిధి):
రాజీవ్ ఇండోర్ స్టేడియం, వికాస్‌నగర్ బీసీ రోడ్‌లో స్థానిక శ్రీ శాంతి యోగా ఇన్స్టిట్యూట్ రెండో వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతం యూనివర్సిటీ యోగ ప్రొఫెసర్ డాక్టర్ యూ. రామారావు, కార్పొరేటర్ పల్లా శ్రీను, యోగా గురువు కనకరావు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో యోగా సాధకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ప్రధాన అతిథిగా ప్రసంగించిన డాక్టర్ రామారావు మాట్లాడుతూ, “యోగ అనేది శారీరక ఆరోగ్యానికే కాక మానసిక సమతుల్యతకు, వ్యక్తిత్వ వికాసానికి కీలకం. ఇలాంటి సంస్థలు సమాజ ఆరోగ్యానికి ఎంతో గొప్ప సేవ అందిస్తున్నాయి” అని అన్నారు.
సంస్థ డైరెక్టర్ శ్రీను మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లో సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు, వర్క్‌షాపులు, ఉచిత యోగా శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని యోగా ప్రచార కార్యక్రమాలు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా చిన్నారులు, పెద్దలు చేసిన యోగా ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంస్థ నుంచి శిక్షణ పొందిన పలువురు చిన్నారులు నేషనల్ లెవెల్ వరకు ఎంపిక కావడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.


