విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన విశాఖపట్నం నగరంలోని ఎల్వీనగర్‌లో వెలుగుచూసింది. నేవీ టెక్నీషియన్ రవీంద్ర(35) తన ప్రియురాలు మౌనిక(29)ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల సమాచారం ప్రకారం, రవీంద్ర భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిన నేపథ్యంలో ఆదివారం రాత్రి మౌనికను తన ఫ్లాట్‌కు పిలిచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా ఆగ్రహంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆధారాలు చెరిపివేయడానికి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత నేరభారం తట్టుకోలేక రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, మౌనిక శరీర భాగాల్లో తల కనిపించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఆ దిశగా పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ అమానుష ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.



