బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ ఆదేశం
అమరావతి, అక్టోబర్ 22 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో పాటు ఎపిఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ శ్రీ కె విజయానంద్ మాట్లాడుతూ, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో అన్నీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని, దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సహయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లలో సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని శ్రీ విజయానంద్ సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మేరకు సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సమాచారం అందించాలని ఆయన సూచించారు. ప్రజలకు సహయం అందించేందుకు కంట్రోల్ రూమ్లలో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.
వాయుగుండం ప్రభావం వల్ల ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్, రవాణా వంటి సదుపాయాలు కల్పించడంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా అవాంతరం ఏర్పడితే తక్షణమే వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని శ్రీ కె. విజయానంద్ ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పటికప్పుడు కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ వాయుగుండం ప్రభావం ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో అధికంగా ఉంటుందని తెలియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఎండీ లోతేటి శివశంకర్ ను సీఎస్ శ్రీ కె.విజయానంద్ ఆదేశించారు.
ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించేలా అవసరమైన సామాగ్రితో పాటు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని సీఎస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో తీసుకుంటున్న చర్యలను సీఎస్ కు వివరించారు.

