రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనలతో జిల్లా వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాల ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జిల్లాను ఆరు డివిజన్లుగా విభజించి, ఎస్ఐ స్థాయి అధికారులు మరియు పోలీసు సిబ్బందితో ఆరు రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ముఖ్య కూడళ్ళు, జాతీయ రహదారులు, బ్లాక్ స్పాట్స్ మరియు ప్రమాద ప్రాంతాల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాయి.
సౌత్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఇరగాలమ్మ గుడి ప్రాంతంలో ప్రత్యేకంగా హెల్మెట్ ధరించే అవసరం గురించి ప్రజలకు వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, అతివేగంగా వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు చేయడం మరియు అధిక శబ్దం చేసే సైలెన్సర్ల వినియోగం చట్ట విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.
హైవేల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పోలీసులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 కు కాల్ చేయడం ద్వారా లేదా సమీప పోలీసులను సంప్రదించడం ద్వారా సహాయం పొందవచ్చని సూచించారు.


