– 16 నుండి 18 వరకు, తిరిగి 23 నుండి 25 వరకు 6 రోజుల పాటు గ్రామాల్లో పర్యటన
– ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి ‘పంచ సూత్రాల’పై అవగాహన
– ఎల్ నినో ముప్పు – నీటి సంరక్షణపై రైతులకు దిశానిర్దేశం
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతన్న మీ కోసం”కార్యక్రమం గ్రామాల్లో సందడిగా ప్రారంభమైంది. వ్యవసాయ శాఖతో పాటు పశుసంవర్ధక, ఉద్యానవన తదితర అనుబంధ శాఖల సిబ్బంది ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో రైతుల ఇంటి వద్దకే వెళ్లి సాగు మెలకువలను వివరిస్తున్నారు. ఈ నెల 16 నుండి 18 వరకు మొదటి విడతగా, తిరిగి 23 నుండి 25 తేదీ వరకు రెండో విడతగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ముఖ్యమంత్రి గారి ‘పంచ సూత్రాల’ ప్రచారం:
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన పంచ సూత్రాలను కరపత్రాల ద్వారా రైతులకు వివరిస్తున్నారు. పంటల ఎంపిక నుండి మార్కెటింగ్ వరకు అనుసరించాల్సిన వ్యూహాలను సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
నీటి కొరతపై అప్రమత్తం – ఎల్ నినో ప్రభావం:
వచ్చే జూన్ నెల నుండి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు:
పంటల మార్పిడి తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటల వైపు మొగ్గు చూపాలి.తోటల సంరక్షణ చీని, నిమ్మ వంటి ఉద్యాన పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా చేపట్టాల్సిన రక్షణ చర్యలపై రైతులకు ప్రత్యక్షంగా వివరిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయం తక్కువ నీటితో సాగు చేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామాలు – ప్రత్యామ్నాయాల వైపు:
మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ పరిస్థితుల కారణంగా కొన్ని వ్యవసాయ పరికరాలు, దిగుమతి వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని, అందుకే రైతులు ఖర్చు తగ్గించుకునే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న వివిధ పథకాలు మరియు రాయితీల గురించి కూడా ఈ పర్యటనలో క్షుణ్ణంగా వివరిస్తున్నారు.


