రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, పాము కాట్లు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు, రాష్ట్రంలో త్వరలోనే 190 కొత్త 108 అంబులెన్స్‌లు ప్రారంభించబోతున్నామని. ప్రస్తుతం ఉన్న అంబులెన్స్‌లలో చాలా పాతవి తరచుగా రిపేర్ అవుతున్నందున వాటిని తొలగించి, ఆధునిక సదుపాయాలతో కొత్త వాహనాలను ప్రవేశపెట్టనున్నారు.
ఈ కొత్త వాహనాల్లో 56 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ మరియు 136 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు ఉంటాయి. వీటి ద్వారా రోగులు, ప్రమాద బాధితులు గోల్డెన్ అవర్‌లోపే ఆస్పత్రులకు చేరేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 650 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయని, కొత్త వాహనాలతో కలిపి మొత్తం సంఖ్య 731కు చేరుకుంటుందని మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక పాత అంబులెన్స్‌లు డొక్కు, తుక్కుగా మారాయని విమర్శించిన సత్యకుమార్, కొత్త వాహనాలు నేషనల్ అంబులెన్స్ కోడ్ (NAC) ప్రకారం తెలుపు-ఎరుపు రంగుల్లో ఉంటాయని చెప్పారు.
ఇకపై అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల ప్రమాద బాధితుల ప్రాణరక్షణ శాతం పెరుగుతుందని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేసింది.


