రాజమహేంద్రవరం, తేదీ:21.10.2025
రాబోయే రబీ సీజన్లో యూరియా నిల్వలు & పంట నమోదు పై జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష
రాబోయే రబీ సీజన్లో యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్ నుండి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తుగా సరిపడా యూరియా నిల్వలు కల్పించామని తెలిపారు. గత మూడు సంవత్సరాల రబీ సీజన్లలో వినియోగించిన ఎరువుల సగటును పరిగణనలోకి తీసుకుని, ఈ సీజన్‌కు తగినంత యూరియా అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 3,214 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉందని, రాబోయే రబీ సీజన్‌కు 55,000 మెట్రిక్ టన్నుల అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. అవసరమైన యూరియాను సమయానికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామన్నారు.
జిల్లాలో వరిలో ఇ పంట నమోదు 100 శాతం పూర్తయిందని, ఇతర పంటలను కలుపుకుని మొత్తం 62 శాతం ఇ పంట నమోదు పూర్తయ్యిందని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి పంటల నమోదును 100 శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా అందుతున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్లను క్లోజ్ చేసేటప్పుడు ఎండోర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలన్నారు.
ధాన్యం సేకరణకు జిల్లాలో 212 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, మిల్లర్ల నుండి బ్యాంకు గ్యారంటీలు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం తరలించే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
స్వమిత్వ సర్వే కార్యక్రమం కింద ఫేజ్-1 లో 64 గ్రామాలు, ఫేజ్-2 లో 102 గ్రామాలలో సర్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. 99 శాతం గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయ్యింది అన్నారు. ఈ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను సమర్థవంతంగా వసూలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత, భోజనం నాణ్యత, వార్డెన్ల అందుబాటుతో పాటు విద్యార్థుల సంక్షేమంపై సమగ్రంగా పరిశీలించి నివేదికను సమర్పించాలి అని సూచించారు.
గృహ నిర్మాణ పనుల్లో దశల వారీ కన్వర్షన్ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని గృహాలను పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, డి ఆర్ వో టి సీతారామ మూర్తి, డి ఏ ఓ ఎస్ మాధవ రావు, డీపీ ఓ శాంతమణి, డి డి ఓ వీణా దేవి, ఏడి సర్వే బి లక్ష్మీనారాయణ, సీపీఓ అప్పాలకొండ తదితరులు పాల్గొన్నారు.


