గద్వాల్ (పున్నమి ప్రతినిధి )
*రాజ్యసభకు ఎస్సీ–ఎస్టీలను పంపించాలి*
*-కొమ్మల ప్రవీణ్ రాజ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ సెక్రటరీ మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి డిమాండ్*
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యసభకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులను పంపించకపోవడం అన్యాయమని **తెలంగాణ రాజ్యాధికారం పార్టీ** స్టేట్ సెక్రటరీ మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి **కొమ్మల ప్రవీణ్ రాజ్** తెలిపారు. రాబోయే రాజ్యసభ ఖాళీల్లో తప్పనిసరిగా ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని మరియు అన్ని రాజకీయ పార్టీలను కోరారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఎస్సీ–ఎస్టీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సింఘ్వీ (ఓసీ), రేణు చౌదరి (ఓసీ), మందాడి అనిల్‌కుమార్ యాదవ్ (బీసీ) సభ్యులుగా ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ నుంచి బి. పార్థసారథి రెడ్డి (ఓసీ), డి. దామోదరరావు (ఓసీ), కే.ఆర్. సురేష్ రెడ్డి (ఓసీ), వద్దిరాజు రవిచంద్ర (బీసీ) రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. వీరిలో అభిషేక్ మను సింఘ్వీ మరియు కే.ఆర్. సురేష్ రెడ్డిల పదవీకాలం వచ్చే ఏప్రిల్ 9న ముగియనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ప్రతి రాజ్యసభ ఎన్నికలోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం కల్పించలేదని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ పరిస్థితి మారలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఎస్సీ, ఎస్టీ సమాజాలకు ఉన్నత సభలో స్థానం కల్పించడం సామాజిక న్యాయానికి నిదర్శనమని **కొమ్మల ప్రవీణ్ రాజ్** అన్నారు.
రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కనీసం ఒక స్థానాన్ని ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థికి కేటాయించాలని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ తరఫున ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమానత్వం, సామాజిక న్యాయం సాధించాలంటే అణగారిన వర్గాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

