
భీమిలి నియోజకవర్గంలో వి.ఎం.ఆర్.డి.ఎ. రోడ్ల పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్ ప్రణవ్ గోపాల్, సీయూపీ శిల్ప లతో గురువారం సమావేశమైన ఆయన రూ. 170 కోట్ల అంచనాతో మొదలుపెట్టిన 7 రోడ్లను భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యే నాటికి సిద్ధం చేయాలని చెప్పారు. తంగుడుబిల్లి హౌసింగ్ ప్రాజెక్టు రోడ్ల నాణ్యత లోపం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ప్రాజెక్టు సందర్శించినప్పుడు ఏడాది కూడా పూర్తి కాకుండానే రోడ్లు దెబ్బ తిన్నాయని గుర్తించినట్టు తెలిపారు. దీనిపై ప్రణవ్ స్పందిస్తూ వాటిని స్వయంగా సందర్శిస్తానని.. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే విశాఖలో ఈట్ స్ట్రీట్.. స్మార్ట్ స్ట్రీట్ వంటి ప్రాజెక్టులను ప్రోత్సహించాలని గంటా సూచించారు. సమావేశంలో గంటా రవితేజ తదితరులు పాల్గొన్నారు.

