ఖమ్మం, అక్టోబర్
(పున్నమి ప్రతినిధి)
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొందా’ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని, నీటి వనరుల సమీపంలో నివసించే కుటుంబాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
జాగ్రత్త సూచనలుగా వాగులు, వంకల దాటే రహదారులపై ప్రయాణాలు చేయకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని గల్లా సత్యనారాయణ తెలిపారు. విద్యుత్ తీగలు లేదా నీటి ప్రవాహాల ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, గ్రామాలు మరియు పట్టణాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాల సమయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రజల ప్రాణ భద్రతనే ప్రధాన ప్రాధాన్యతగా తీసుకోవాలని గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు.


