చీపురుపల్లి, అక్టోబర్ 28:
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర తుపానుగా బలపడిన మొంథా తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) విజ్ఞప్తి చేశారు.
మొంథా తుపాన్ ప్రస్తుతం మచిలీపట్నం నుండి 190 కిలోమీటర్లు, కాకినాడ నుండి 270 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం నుండి 340 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన తెలిపారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ తుపాన్ ఈ రోజు రాత్రి కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తీరప్రాంతాలు మరియు సమీప జిల్లాల్లో గాలుల వేగం గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉండటంతో పాటు, శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు విస్తార ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతు సోదరులు, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని బెల్లాన చంద్రశేఖర్ గారు సూచించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వం, సిబ్బంది పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.


