ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూజ్యులు ఎన్టీఆర్ గారు తనకు నీతి–నిజాయితీ రాజకీయాలు నేర్పారని గుర్తు చేశారు. కష్టపడితే సామాన్యులు కూడా రాజకీయాల్లో ఏదైనా సాధించవచ్చని చంద్రబాబు నాయుడు చూపించారని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ శైలి వేరు, వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తారని అన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు.
నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఎవ్వరిని నొప్పించకుండా పనిచేశానని, అది దైవ నిర్ణయమేనని చెప్పారు. గత ప్రభుత్వంలో భద్రాద్రి రామాలయ అభివృద్ధి సాధ్యం కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పునరుద్ధరణ పనులు చేపట్టామని వెల్లడించారు. శ్రీరామ నవమి రోజున సీఎం రేవంత్ చేతుల మీదుగా రామాలయ విస్తరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీ, టూరిజం రంగాల్లో కృషి చేశానని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టామని, తెలంగాణలో పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రాసెసింగ్ ప్లాంట్లతో పంటలకు అదనపు విలువ కల్పించనున్నట్లు చెప్పారు. తుఫాన్లు, చీడపీడలు, కోతుల బెడద లేకుండా పామాయిల్ సాగు రైతులకు వరంగా మారిందన్నారు. పామాయిల్‌లో అంతర పంటలుగా కోకో, జాజి, వక్క, మిరియం సాగుతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.
సమాజంలో జీవన ప్రమాణాలు పెరిగే చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తే సమాజమే తిరిగి ఇస్తుందని అన్నారు. అబ్దుల్ కలాం, స్వామినాథన్, కురియన్ వంటి మహానుభావుల వల్ల దేశం ప్రగతి బాటలో నడిచిందని పేర్కొన్నారు. రైతు కేంద్రంగా ప్రభుత్వ లక్ష్యాలు, పరిశోధనలు ఉండాలని సూచించారు. అడవుల్లో ఎలాంటి ఎరువులు లేకుండానే మొక్కలు చక్కగా ఎదుగుతాయని, విచ్చలవిడిగా ఎరువులు–పురుగుమందులు వాడటం వల్ల కాలుష్యం పెరుగుతోందని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మనకు హెచ్చరిక లాంటిదని, కాలుష్యరహితంగా భూమాతను కాపాడేలా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం యజ్ఞంలా చేసే అవకాశం దక్కిందన్నారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజాసేవ చేసే భాగ్యం భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతో లభించిందని చెప్పారు. సీఎం రేవంత్ పాలనలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన నలబై ఏళ్ల రాజకీయ జీవితం ప్రజాసేవగా సాగిందన్నారు.



