*మొంథా తుఫానుపై ఆందోళన వద్దు…అప్రమత్తంగా ఉందాం*
*రేపటి నుంచి పెరగనున్న తుఫాను ప్రభావం….338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం*
*తుఫాను ప్రభావంపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం*
*రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు*
*ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలెర్ట్ చేసే అవకాశం*
*మంత్రులు, అధికారులతో రాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*
*అమరావతి, :* మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 338 మండలాలు, 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే మొంథా తుఫానుపై ఆందోళన వద్దని…అప్రమత్తంగా ఉందామని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు మరోసారి తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్ లో సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్ తో పాటు….రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి తుఫాను తీవ్రత పెరగనన్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సిఎం సూచించారు. అలాగే ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సిఎం సూచించారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్దతపై ఐవిఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపైనా సీఎం సమీక్ష చేశారు. అధికారులు ఎన్ని రివ్యూలు నిర్వహించారు అనేది కాదు…క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని…దీనికి పబ్లిక్ పర్సెప్షన్ ను ప్రాతిపదికగా తీసుకోవాలని సిఎం అన్నారు. తుఫానుపై ప్రభుత్వ సన్నద్దత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. అదే విధంగా తుఫానుకు సంబంధించిన జాగ్రత్తలపై మీమీ.. ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అని అంశంపై 70 శాతం మంది అవును అన్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై 74 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పర్సెప్షన్ నివేదికలు చెపుతున్నాయని అధికారులు తెలిపారు. దీన్ని కొనసాగించాలని…ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు…వారి అవసరాలు, ఇబ్బందులు కూడా రియల్ టైంలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సిఎం అన్నారు. ప్రజలను అప్రమత్తం చేసేక్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొట్టమొదటి సారిగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేశామని…..రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టిజీ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్ ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ ఉదయం లోపు తుఫాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముప్పు తప్పే వరకూ ప్రతీ శాఖ, ప్రతీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సిఎం సూచించారు.


