గాజువాక: నవంబర్ (పున్నమి ప్రతినిధి)
మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి పుణ్యదినం సందర్భంగా పాత కర్ణవానిపాలెం రామాలయంలో కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ మంగళవారం వైభవంగా జరిగింది. పల్లకిపై స్వామివారిని సుందరంగా అలంకరించి వేదఘోషాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కర్ణం నరసింగరావు, జ్యోతి దంపతులు, శ్రీనివాసరావు, రూప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం నరసింగరావు మాట్లాడుతూ హిందూ ధర్మంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు అపారమైన శక్తి, మహిమ ఉందని తెలిపారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి శుభఫలితాలు లభిస్తాయని అన్నారు. పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా, చదువులో వెనుకబడి ఉన్నా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. మా ఆలయంలో షష్ఠి పర్వదినానికే కాకుండా స్వామివారి ప్రతిష్టా దినానికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరవెల్లి రవికుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో వేదపండితుల నడుమ కళ్యాణోత్సవం వైభవంగా సాగి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించడం మా పుణ్యభాగ్యమని భావోద్వేగ స్వరంతో నరసింగరావు తెలిపారు. కార్యక్రమంలో సిరశపల్లి అప్పారావు, బీజేపీ నేతలు అశోక్, రంగానాయకులు తదితరులు పాల్గొన్నారు.


