*పోలియో చుక్కలు వేసిన గంటా*
*విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి*_ జీవీఎంసీ 8 వ వార్డులోని సాగర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పల్స్ పోలియో శిబిరంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని, 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి దేశంలో పోలియో జాడ లేనప్పటికీ.. ప్రతీ ఏడాది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారానే ఆ వ్యాధి ఆనవాళ్లు లేకుండా చేయగలమని పేర్కొన్నారు. బిడ్డలకు పోలియో చుక్కలు వేయించడంలో తల్లిదండ్రులది కీలక పాత్రని తెలిపారు. నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, చెట్టిపల్లి సన్యాసిరావు, శాఖారి శ్రీనివాస్, చెట్టిపల్లి గోపీ, సారిపల్లి శ్రీనివాస్, దొరబాబు, ఎ.రాంబాబు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
*దసపల్లా పార్క్ అభివృద్ధికి ఆదేశం*
వార్డులో తుప్పలతో నిండిపోయిన దసపల్లా లే అవుట్ పార్క్ లో తక్షణమే జంగిల్ క్లియరెన్స్ చేయాలని గంటా ఆదేశించారు. చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్న ఈ ప్రాంతంలో పార్క్ అభివృద్ధికి కాలనీ అసోసియేషన్ ముందుకు రావాలని కోరారు. చుట్టుపక్కల పిల్లలు, పెద్దలు వినియోగానికి వీలుగా పార్క్ లో ఆట వస్తువులు.. వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. జోన్ 2 పరిధిలోని మెజారిటీ పార్క్ లు ఇదే స్థితిలో ఉన్నాయని స్థానిక నాయకులు ఫిర్యాదు చేయగా.. మొత్తం పార్క్ లు, వాటి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు చెప్పారు. అలాగే పార్క్ లోపల నుంచి పారుతున్న మురుగునీరు సమస్య పరిష్కారానికి డ్రెయిన్ ప్రతిపాదించాలన్నారు.


