గూడూరు మే 19, 2020 (పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : గూడూరు పట్టణములోని దర్గా ఆవరణలో మంగళవారం నాడు ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 250 నిరుపేద ముస్లిం కుటుంబాలకు గూడూరు దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్.రియాజ్ అహ్మద్, డాక్టర్ సిద్ధిక్, మత గురువు మొహమ్మద్ యూసుఫ్ హుస్సేన్, ఏపి.ఎం.డబల్యూ.ఓ. జిల్లా అధ్యక్షులు మగ్ధుమ్, మైకా కరిముల్లాల చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ మగ్ధూమ్ మాట్లాడుతూ ఈద్గా యూత్ అసోసియేషన్ నిర్వాహకులు సామాన్య మధ్యతరగతికి చెందిన యువకులు చెందినవారని, కానీ సేవ చేసే విషయంలో మాత్రం శ్రీమంతులని, ఈద్గా సభ్యులందరూ చిన్నవ్యాపారాలు చేసుకుంటూ స్వచ్చందంగా వారి సంపాదనలోంచి కొంత నగదును కేటాయిస్తూ లాక్ డౌన్ మొదలయినప్పటి నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ దేశ పౌరులుగా తమవంతు బాధ్యతను నిర్వహిస్తున్న ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులు గూడూరు ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. సేవ చేయాలంటే కోటీశ్వరులు కానక్కరలేదని దృఢ సంకల్పం ఉంటే చాలని చెపుతూ ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేసారు. మత గురువు యూసుఫ్ హుస్సేన్, మౌలానా షఫీలు మాట్లాడుతూ లాక్ డౌన్ విపత్కర పరిస్థితుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు మేమున్నామంటూ భరోసాను కల్పిస్తున్న ఈద్గా సభ్యులకు అభినందనలు చెప్పారు. ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులు షేక్. షబ్బీర్ మాట్లాడుతూ మా ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యుల సమిష్టి కృషి వల్లే మేము విజయవంతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగానే 200 మందికి రంజాన్ తోఫా కిట్లను అందజేసామని, అలాగే పండుగలోపు మరి కొన్ని కుటుంబాలకు ఇస్తామని పేర్కొన్నారు. పండుగను ప్రతి పేదవాడు సంతోషంగా జరుపుకోవాలన్నదే ఈద్గా యూత్ అసోసియేషన్ యొక్క లక్ష్యమని అందుకు అనుగుణంగా సేవలను విస్కృతం చేస్తామని హాషిం చెప్పారు. ప్రేమ, దయ, శాంతి, దాన ధర్మాలకు మరో పేరే రంజాన్ అని దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్.రియాజ్ అహ్మద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా సభ్యులతోపాటు మరికొంతమంది పెద్దలు పాల్గొనడం జరిగింది.