నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనలతో జిల్లా వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జిల్లాను 6 డివిజన్లుగా విభజించి, SI స్థాయి అధికారులు మరియు సిబ్బందితో 6 రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులు, బ్లాక్ స్పాట్స్ మరియు ప్రమాద ప్రదేశాల్లో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాయి.
సౌత్ ట్రాఫిక్ CI ఆధ్వర్యంలో ఇరగాలమ్మ గుడి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ఓవర్ స్పీడింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు నేరమని స్పష్టం చేశారు.
పోలీసులు ప్రజలకు ఇచ్చిన ముఖ్య సూచనలు:
హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి
మద్యం సేవించి వాహనం నడపరాదు
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
మైనర్లు వాహనాలు నడపకూడదు
అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ప్రమాదకరం
ప్రామాణిక హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా హైవేల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల తగ్గింపులో ప్రజల సహకారం కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 లేదా సమీప పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.



