తిరుమల నవంబర్ (పున్నమి ప్రతినిధి)
భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తితో దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరిన ఆమె, తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి సాదర స్వాగతం పలికారు. ఆలయ ఆచారాలను పాటిస్తూ, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం అందించారు. ధ్వజస్తంభాన్ని నమస్కరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్రపతితో పాటు ఉన్నారు.
తదుపరి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం నిర్వహించగా, టీటీడీ అధికారులు శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు, 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను ఆమెకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకి దేవి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, అలాగే జిల్లా కలెక్టర్ డా. వేంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


