*విశాఖపట్నం,పున్నమి ప్రతినిధి:-*
జాతీయ న్యాయ సేవ సహకార సంస్థ స్థాపన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ సహకార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ జిల్లా సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు ఎంవిపి కాలనీ నం.1లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచి, భారత రాజ్యాంగం ఉద్దేశించిన సమన్యాయం, సామాజిక న్యాయం, అందరికీ న్యాయం అందుబాటు వంటి విలువలను వివరించారు. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల ప్రకారం ఆర్టికల్ 39ఏ ఆధారంగా 1987లో జాతీయ న్యాయ సేవ సహకార సంస్థ ఏర్పాటైందని తెలిపారు.
విద్యార్థులు కృషి చేసి ఉన్నత స్థానాలకు చేరి సమాజానికి సేవ చేయాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు కే. రామారావు, సహాయ అధికారి ఆర్. శ్యామల, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేంద్ర మణి తదితరులు పాల్గొన్నారు.


