ప్రతి సంవత్సరం మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’ జరుపుకుంటాము. మానవ జీవనానికి నీటి ఆవశ్యకతను తెలియజేయడం, మంచినీటి వనరుల సంరక్షణపై అవగాహన కల్పించటం ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేని బిలియన్ల మంది ప్రజల సమస్యలను పరిష్కరించడం మరియు 2030 నాటికి అందరికీ నీరు, పారిశుధ్యం అందించాలనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం తో 1992లో రియోడిజెనీరోలో జరిగిన పర్యావరణ సదస్సులో చేసిన ప్రతిపాదన మేరకు, ఐక్యరాజ్యసమితి 1993 నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ జల దినోత్సవం ‘నీరు, మహిళలు మరియు లింగ సమానత్వం’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది 2026 థీమ్ నిర్వహించబడుతున్నది. నీటి సంక్షోభం మహిళలపై చూపే ప్రభావం మరియు నీటి యాజమాన్యంలో వారి భాగస్వామ్యంపై ఈ థీమ్ దృష్టి పెడుతున్నది. ఈ సందర్భంగా జలం మన బలం అనే ఈ కవితాశీర్షిక
ప్రాణికోటికి నివాసం భూగోళం
నీలవర్ణంతో ఆవరించింది జలం
నీరు సకల జీవరాశికి మూలం
మేఘఆగమననేస్తం ఉపరితలం
జలవనరులకు కేటాయించు స్థలం
ఇది ప్రకృతి చక్రీయఆకృతిలోని కాలం
నీటిలబ్ధితో మానవ మనుగడ నిశ్చలం
నీటి మార్గాల సంరక్షణే భావిఫలం
అవనిపై శుద్ధినీటిక్షేత్రాల పరిరక్షకులం
హరితావరణపోషనే గంగాప్రవాహశీలం
ఆటంకదారులకు మనమే త్రిశూలదారులం
ముందుచూపుతో రాదు జలకళకు కలకలం
మేఘం వర్షిస్తే నదుల నాట్య విన్యాసం
పర్యావరణస్వీకృతి సంరక్షణ దరహాసం
నవీనయుగంలో ప్రకృతితో సహవాసం
నిరంతరం సంబరమే భూగ్రహ ఆవాసం
పశుసంపద ప్రమాణానికి అవసరం గ్రాసం
జీవుల చలన సంపత్తికి ఆహార విలాసం
సహజవనరుల స్నేహాత్మక సంతోషం
జలామృత నిల్వకు నిరంతర అభ్యాసం
హరిత ఆహ్లాద వాతావరణం కోసం
వనవాసాల్లేని మధుమాసం కోసం
జలారాధన జీవసంరక్షణ
మనిషి మనుగడకు నిత్య ఆలంబన
అన్నిటికి మించి జలం మన బలం


