ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలోనూ ఈ పుష్కరాలు నిర్వహించినా, ప్రధాన ప్రాంతం మాత్రం (అంటే సముద్రంలో కలిసే అంతిమ ప్రాంతం) రాజమండ్రి సమీపంలోనే ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరం అంటేనే అధిక ప్రాధాన్యం ఏర్పడింది.
గతంలో అంటే 12 ఏళ్ల కిందట కూడా టీడీపీ హయాంలోనే గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు వచ్చే ఏడాది మరోసారి కూడా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇవి జరగనున్నాయి.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏడాదిన్నర ముందే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ పుష్కరాలను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. గోదావరి పుష్కర పనులపై తొలిసారిగా చంద్రబాబు శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలపై చర్చించారు.
గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు.
ఈ పుష్కరాల నిమిత్తం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లను నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.



