చిట్వేల్, సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం గరుగుపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ వినాయక స్వామి ఆలయంలో 39వ మండల పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాయిని బ్రాహ్మణులు, గొల్లవారు, రజకులు కలిసి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, శిల్పకళా వైభవంతో గుడిని అలంకరించారు. సెప్టెంబర్ 10 బుధవారం నాడు నాయిని బ్రాహ్మణ సంఘానికి చెందిన మారపురం గురవయ్య కుటుంబం ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వేకువజాము నుండి పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అభిషేకం, అర్చనలు జరగగా, సన్నాయి, డోలు, మృదంగం, నాదస్వరాల నాదంతో గ్రామమంతా భక్తి రసమయంగా మారింది. భక్తులు వినాయకుని పాటలకు పరవశించి స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజల అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పాలు సమర్పించి, నైవేద్యంగా పళ్ళు, పలహారాలు సమర్పించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని బ్రాహ్మణ సంఘానికి చెందిన సభ్యులను గురవయ్య వారు శాలువాలతో ఘనంగా సన్మానించారు.


