మానవత్వం ఉన్న ప్రతి మనిషి అందరిని సమానంగా చూస్తాడు. నైతిక విలువల పట్ల విధేయత చూపుతాడు. మనసు మనసు తోడై ఆకర్షితులైన స్త్రీ పురుషులు జీవితానికి పూలబాట వేసుకుని జీవన రథచక్రాలై సరైన మార్గంలో సాగి పోతారు. ‘ప్రేమ’ కొలువున్న ప్రదేశం కల్మషం లేని హృదయం. ఈ హృదయాలను ధరించిన జంటలు మేరువులై జీవన స్రవంతిలో పూబంతులై పరిమళిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. కష్ట సుఖాలు, కలిమి లేములు జీవన యాత్రకున్న లక్షణాలు. చీకటి వెన్నెలవోలె కష్ట సుఖాలు. ఇదే కదిలే కాలం. చీకటిని అనుభవించిన తర్వాతే వెన్నెల కున్న ప్రాముఖ్యత చక్కగా బోధపడుతుంది. జీవితం మీద విరక్తి కల్గించిన కాలం కల్పవృక్షమై నిలిస్తే అదే ‘కలిసొచ్చిన కాలం’ బ్రహ్మరాతలకు రూపు దిద్దుకున్న అలంకారం. ఇక కథలోకి వెళ్దాం…
బస్సు వేగంగా సాగిపోతుంది. చల్లని గాలి వీస్తుంది. తన తలపులలో కొలువుండే వనజకు పెళ్ళవుతుందన్న వార్త తెలుసుకున్న సుమంత్ హృదయం బరువెక్కి నీటిలో రాయిలా ఉంది. వెనక్కి పోతున్న చెట్లను విచారంగా చూస్తూ ఉన్నాడు. గడిచిన తన 20 సం॥రాల జీవితం కళ్ళముందు కనబడుతుంది. తీపి గుర్తులు చేదుగుర్తులయ్యేటట్లున్నాయి. క్షణమునకో ఆలోచన ఉదయిస్తుంది. ఓ చోట ఉన్నట్లుండి బస్సు ఆగింది. రోడ్డు ప్రక్కనున్న మైలురాయి కనిపించింది. దాని పై హైదరాబాద్ 45 km అని వ్రాసుంది. మరో గంటలో హైదరాబాద్ లొ ఉంటాననుకొని, ‘వనజను కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు అతనెవరో చూడాలి. అయినా మావయ్య నాకు ఆహ్వానం పంపలేదు’ అక్కడి కెళ్ళడం మర్యాద కాదేమోనని తలచి తన మిత్రుడు మాధన్ ఇంటికెళ్ళాలనుకున్నాడు. కాస్సేపటిలో బస్టేషన్ వచ్చేసింది. వనజను తన కళ్ళల్లోనే దర్శించు కుంటూ బస్సు దిగాడు సుమంత్.
మాధన్ ఇల్లు విద్యుత్ నగర్ లో ఉంది టౌన్ సర్వీస్ కూడా సిద్దంగానే ఉంది. ఆ బస్సెక్కాలో లేదా వనజ కళ్యాణ మండపం వైపెళ్ళాలో దిక్కుతోచడం లేదు సుమంత్కి. వనజ పెళ్ళయినా కళ్ళారా చూడాలని తన మనసు ఉబలాట పడుతున్నది. ‘వనజకు నేనంటే ఇష్టమే, కాని నాపై ఉన్న ఇష్టం కన్నా తన తండ్రిమీదే ప్రేమెక్కువ. అతని మాటకు ఎదురివ్వక అతని ఇష్ట ప్రకారమే పెళ్ళికంగీకరిచిందేమో.. మనిషికి మనసుంటే చాలదు. మనీ కూడా కావాలి.. అది నా దగ్గిర లేదు గనుకే వనజకు మేనల్లుణ్ణి నేనొకడున్నానని కూడా చూడకుండా మ్యారేజ్ ఫిక్స్ చేశాడు మామయ్య.. సర్లే వనజ నన్ను పెళ్ళాడినట్లయితే వనవాసమే.. కాదామరి! పేదవాణ్ణి పెళ్ళాడితే.. రాతలు ప్స్’ అని తన మనసు తో మాట్లాడి నిరాశ ముఖం తో టౌన్ సర్వీసెక్కబోయాడు. అనుకోకుండా మాధవ్ అదే బస్సులోంచి దిగుతూ ‘ఏరా సుమంత్ పి.జి. పూర్తయిందా.. అన్నట్లు ఎప్పుడొచ్చావ్.. అమ్మ బాగుందా..’ అంటూ 5 నిముషాలు డబడబా మాట్లాడేశాడు మాధవ్. ‘ఇప్పుడే దిగారా.. ఈమధ్య మనసేం బాగోలేదు నిన్ను కలవాలనిపించింది.. వెంటనే వచ్చేసా.. అంతే’ ఏదో దాస్తున్నట్లు చెప్పాడు సుమంత్. ‘సరే.. అన్నీ తర్వాత మాట్లాడుతాం గానీ.. మరో 30 ని॥లలో ఆ… కన్పించే కళ్యాణ మండపంలో మా చిన్నాయన కొడుక్కి పెళ్లి’ అంటూ దూరంగా ఉన్న దాన్ని వేలెత్తి చూపిస్తూ ‘పెళ్ళి కుమార్తె పేరు వనజ.. వాళ్ళు కూడా బాగా ఉన్నవారే సుమా!’ అంటూ టాక్సీని పిలిచాడు మాధవ్. ‘ఉన్నవాళ్ళు కాబట్టే నన్ను దూరం చేసుకున్నారు’ నోటిలో గొణుక్కుంటూ ఎలాగయినా సరే వనజ తనకి దక్కకున్నా ఆ దక్కించుకునే వాణ్ణి చూడాలన్న తాపత్రయం తనలో ఎక్కువైంది. మరేం చెప్పలేక సరే పదమంటూ మిత్రుడితో కలిసి కళ్యాణ మండపానికి బయల్దేరాడు సుమంత్.
కళ్యాణ వేదిక విద్యుద్దీపాలంకరణలతో శోభాయ మానంగా ఉంది. ఆ కాంతులలో వనజ సౌభాగ్య లక్ష్మిగా దర్శన మిచ్చింది. ‘వేసవి సెలవులలో మా ఇంటి కొచ్చి నాతో ఆడి పాడిన వనజేనా ఈమె’ అనుకుని ఆ అందాన్ని మరెప్పుడూ చూడలేనట్లు చూస్తూ నిలబడిపోయాడు సుమంత్. ‘కూల్ డ్రింక్ ప్లీజ్’ అన్న శబ్దం వినబడింది. తీసుకున్న కూల్ డ్రింక్ చేతిలోనే ఉంచుకొని వనజను తనివి తీరా చూస్తూ నిలబడి పోయాడు. తన మావయ్య ఆ పెళ్ళి సందడిలో సుమంత్ను కనీసం పలకరిచనూ లేదు. మాధవ్ సుమంత్ని పెళ్ళికొడుక్కి పరిచయం చేస్తూ ‘హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’ అని చెబుతాడు. ప్రక్కనే ఉన్న వనజ సుమంత్ రాక చూసి ఆనందిస్తుంది కాని అతని ప్రేమను గ్రహించలేదు. చనువుగా ప్రవర్తించేది ఆ చనువే ప్రేమగా భావించాడు సుమంత్. చనువుతో పాటే వారిరువురి వయసు కూడా పెరగడంతో వీరెక్కడ ప్రేమించి పెళ్ళి చేసుకుంటారోనని, అలా జరిగితే తన కూతురు పేదింటి కోడలవుతుందని రాకపోకలను కట్చేసి చివరకు ఆహ్వానం కూడా పంపలేదు తన మావయ్య.
పురోహితులు మంత్రాలు చదువుతుండగా, మంగళ వాయిద్యాలతో వనజ మెడలో మూడుముళ్ళు పడ్డాయి. వనజకు వెళ్ళాస్తానంటూ తన చూపులతోనే తెలిపాడు సుమంత్. సుమంత్ను ఆపి మనస్ఫూర్తిగా మాట్లాడాలంటే తన తండ్రి అడ్డు పడడంతో ఏమీచేయలేక తటస్థంగా ఉండిపోయింది వనజ. తను ఆశించింది పొందలేనపుడు ఎవరికైనా బాధే. మాధవ్ ఎంత బ్రతిమలాడినా ఉండకుండా తన గ్రామానికి బయల్దేరాడు సుమంత్.
***
‘ఎప్పటి నుంచో చెబుతూనే వచ్చాను.. మీ మావయ్య ధనమే జీవితం అనుకునే మానవత్వం లేని మనిషని, అతనికి రక్త సంబంధం, మమతాను రాగాల విలువ తెలియదు. తెలిసిందల్లా ఒకటే.. ధనం, హోదా.. ఇప్పటికైనా అన్నీ మరచిపో బాబు’ అంటూ సుమంత్ ని ఓదార్చుతూ గిన్నెలో అన్నం పెడుతుంది తన తల్లి అన్నపూర్ణమ్మ. కాని ప్రేమించిన నేరానికి శిక్ష ఉపవాసం ఇది కాలం చెప్పే మాటగా ఆ రోజంతా పస్తుండి పోయాడు సుమంత్.
**
నిరాశ నిస్పృహల మధ్యన తను చదివిన చదువు కూడా మరచాడు సుమంత్. అన్నపూర్ణమ్మకు ఐదుగురు బిడ్డలు. నలుగురి ఆడపిల్లలకు అతి కష్టం మీద పెళ్లి చేయ గలిగింది. ఆఖరివాడు సుమంత్. నాలుగిండ్లలో పని చేసి తను పోషిస్తున్న అమ్మను చూసి ఏదో ఒక ఉద్యోగం చేయాలనిపించి విశాఖపట్నం లో టైపిస్టు పోస్టు ఖాళీగుందని తెలిసి మరేం ఆలోచించక కష్టపడుతున్న తన తల్లిని పోషించుటకు ఒక బిస్కెట్ ప్యాక్టరీలో టైపిస్టుగా చేరాడు సుమంత్.
***
‘అమ్మా రూపా.. చదివిన చదువు చాలు.. ఇక నుంచి నీవు చదవాల్సిన అవసరం లేదు మనకేం తక్కువ?.. ఆరు ఫ్యాక్టరీలున్నాయి. B.A. వరకు చదివి అంతో ఇంతో తెలివితేటలు సంపాదించావు.. నీ కంతగా బోరనిపిస్తే.. ఏదో నీకిష్టమొచ్చిన ప్యాక్టరీని మేనేజ్చేయి’ అంటాడు దీప తండ్రి గుణశేఖర్. ఇతను చాలా సహృదయుడు పెంచిన మమకారం తప్ప తన కన్నకూతురు కాదనే భావన ఎప్పుడు రానివ్వలేదు. చదువు మానేసి ఇంట్లో కూర్చోవటం ఇష్టంలేక వారి బిస్కెట్ ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉండడానికి ఒప్పుకుంది దీప.
ఓ రోజు గుణశేఖర్ బిస్కెట్ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరిని దీపకు పరిచయం చేస్తూ ‘ఇతను సుమంత్ అని టైపిస్టు ఈ మధ్యనే చేరాడు ఇతనికి ఇక్కడ ఓ ప్రత్యేక స్థానముందమ్మా.. ఏంటంటే చేరిన మొదటి రోజు మెయిన్ ఆపి నన్ను ఈ ఫ్యాక్టరీని రక్షించాడు. లేకుంటే ఆ… విద్యుత్ తీగ తెగి పెద్ద ప్రమాదమే సంభవించేది’. ‘నా దేముందండి విధి ధర్మం మీదయ’ వినయంగా పలికాడు సుమంత్. పేరుకు తగ్గట్టు అతని వినయశీలతకు దీర్ఘదృష్టికి దీప ఆకర్షితురాలయింది. ‘అంతా వివరించాను ఇక ఈ ఫ్యాక్టరీ బాధ్యత నీదే.. వెళ్ళోస్తానమ్మా’ అంటూ వేరే పని మీద వెళ్ళిపోయాడు గుణ శేఖర్.
ఏదో పోగొట్టుకొని నిరాశతో ఉన్నట్లు సుమంత్ ముఖకవళికను బట్టి దీప గ్రహించింది. ‘చూడండి సుమంత్ గారు.. ఈ ఫ్యాక్టరీ లోని వర్కర్స్ అందరి నేమ్స్, వారి ఏజ్ టైప్ చేసి నాబల్ల మీదుంచండి’ అని చల్లని గాలి వీచినట్లుగా చెప్పింది దీప. ‘అలాగే మేడమ్’ అంటూ చకచక టైప్ చేసి దీప బల్లమీదుంచాడు సుమంత్. నిజానికి అతన్ని పలకరిచాలనే ఉద్దేశ్యంతోనే దీప అలా అంది. సుమంత్ ను గమనిస్తూ ‘మీ ఊరేంటి’ అడిగింది దీప. ‘చిరుకాలం’ ‘ప్రస్తుతం ఎక్కడున్నారు’. ఈ విశాఖపట్నం లోనే ఓ అద్దె గదిలో నేనూ మా అమ్మా ఉంటున్నాం’ ‘మీ నాన్నగారు లేరా!’ ‘నాకు తెలియని వయసులోనే కాలం చేశాడు మేడమ్’ నిదానంగా విధేయతగా సమాధాన మిచ్చాడు సుమంత్.
సుమంత్ యొక్క ప్రవర్తన మాటల్లో దాగుండే అంతరార్థం, బాహ్యతేజస్సు దీపకు బాగా నచ్చాయి. అదే విధంగా దీప యొక్క పలుకు పలకరించే తీరు చూస్తుంటే సుమంత్ హృదయంలో ఏదో ఆశా జ్యోతి వెలుగుతోంది. ‘సుమంత్ అందరిలా కన్పించడేంటి.. తనపనేమో తానేమో.. ఆ నిరాశ పూరిత వైఖరికి కారణం తెలుసుకోవాలి’ అనుకుంది దీప. అతనితో పదే పదే మాట్లాడాలనిపిస్తుంది. ఏమిటో ఆ తెలియని ప్రేమ. కాలేజీ రోజుల్లో ఎంత మంది అందమైన అబ్బాయిలు తనచుట్టూ తిరిగినా పట్టించుకునేది కాదు. ఆడవారి మాటలకు అర్థాలే కాదు మనస్తత్వాలు కూడా వేరు. అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడడు సుమంత్. ధనవంతులకు దూరంగా ఉండాలనే భావన అతనిలో బాగా పేరుకు పోవడమే కారణం.
రోజూ డైరీ వ్రాసుకోవడం అలవాటే సుమంత్కు. వనజ పట్లున్న మౌనప్రేమ, P.G. విశేషాలు అందులో చక్కగా వ్రాసుకున్నాడు. ప్రతి రోజు డైరీ చూసుకోందే ఉండలేడు. ఓ రోజు టేబుల్ మీదుంచి మరచి పోవడంతో అది దీప గమనించి అతని గూర్చి పూర్తిగా తెలుసుకునే చక్కని మార్గంగా భావించి చదువుతుంది.
‘ప్రేమ రెండు హృదయాల మధ్య వారధి. ఈ వారధి కిరువైపుల ఆస్తులు, అంతస్తులు సమపాళ్ళలో ఉన్నపుడే ఇది అమరత్వ ప్రేమ సుధా సన్నిధి’ అని ఇటువంటి వాక్యాలెన్నో.. ఆ డైరీలో వ్రాసున్న అంతరార్ధం దీపకు చక్కగా బోధపడుతుంది. తను M.A. వరకు చదివి ఈ టైపిస్టు ఉద్యోగం చేస్తున్నాడంటే విచారించవలసిన విషయమే అనుకొని ఆ రోజు గుణ శేఖర్కు అంతా వివరించి చెప్తుంది.
గుణశేఖర్ అభిమానం ఉన్న వ్యక్తి కనుక ఆసక్తిగా ఆలకించి తను కాలేజ్ కమిటీ చైర్మన్ కావడం చేత దీప కోరిక కాదనలేదు.
ఓ రోజు సుమంత్ ను పిలిచి ‘మిమ్మల్ని టైపిస్టు పోస్టు నుండి తొలగిస్తున్నా.. అంది దీప. కరెంట్ షాక్ కొట్టినట్లయింది సుమంత్కు. ‘ ఎందుకు మేడమ్’ అమాయకంగా అడిగాడు. ‘ఆ.. కంగారు పడకు నీ గురించి అంతా తెలుసుకున్నాను. నీవు చేయాల్సింది ఈ పోస్టుకాదు విద్యార్థులను తీర్చిదిద్దే అధ్యాపక వృత్తి.. అందుకే మా డాడీకి చెప్పి కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టిప్పించాను.. కాదంటారా సుమంత్గారు’ తియ్యగా పలికింది దీప. సుమంత్ ఆనందానికి అవధుల్లేవు. ‘మేడమ్ మీరు చేసిన సహాయం జన్మ జన్మలకు మరవలేనిది.. మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు’. ఆనందభాష్పాలతో పలికాడు సుమంత్. ‘దాందేముంది సుమంత్ గారు సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఓ మంచి వ్యక్తికి సహాయం చేయడంలో ఆనందం ఉంది అంతే’ అంది దీప.
***
సుమంత్ కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. దీప ఫ్యాక్టరీ కెళ్తూపోతూ అప్పుడప్పుడు దారిలో సుమంత్ని కలుస్తుంటుంది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. సుమంత్ అధ్యాపకార్హత పరీక్షలో ఉత్తీర్ణుడై లెక్చరర్ గా స్థిరస్థానమేర్పరచుకున్నాడు. దీనికంతా దీప సహాయ సహకారాలే కారణం.
ఓ రోజు సుమంత్ ఇంటి కొస్తుంది దీప. అంత ఆస్తి అంతస్తులున్నా గర్వం అంటే తెలియని దీప అన్నపూర్ణమ్మకు అత్యంత ప్రీతి పాత్రమైంది. మధురమైన మాటలచే ఆనందాను భూతిని కల్గించే దీపంటే సుమంతు కు ఎంతో ఇష్టం. దీపను చూడందే ఒక్క రోజైనా ఉండేవాడు కాదు. ఎలాగోలాగ కలుసుకునే వాడు. ‘ఆ అమ్మాయిని చూస్తుంటే చనిపోయిన మీ పెద్దక్క గుర్తొస్తుందిరా.. అదేరూపాన ఉంది.. ఏమిటో ఆభగవంతుని సృష్టి.. మనిషిని పోలిన మనిషి అరుదుగా ఉంటారులే.. అంటుంటుంది తన తల్లి అన్నపూర్ణమ్మ. ‘నిజంగా నాకో అక్క కూతురు ఉండుంటే దీప లాగే ఉండేదేమో..’ అనుకుంటాడు సుమంత్.
దీపకు 25 సం|| నిండాయి. మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్ళి చేయాలని ఇదివరకనుకునే వాడు గుణశేఖర్. కాని సుమంత్ దీప ఒకరికొకరు ఇష్టపడుతున్నారని సుమంత్ ఉత్తముడు ప్రయోజకుడని తలచి వారిద్దరికి పెళ్ళిచేయ నిశ్చయించుకొని సంప్రదాయం ప్రకారం అబ్బాయికి సంబంధించిన వారిని కలవాలనుకొని ఓ రోజు సుమంత్ ఇంటికి బయల్దేరాడు గుణశేఖర్.
కారు సర్రున వచ్చి సుమంత్ ఇంటి ముందాగింది. అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంగా చూస్తూ బయటికొచ్చింది. ‘నమస్కారమమ్మా.. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను’ అంటూ లోపలకెళ్ళి కూర్చుంటూ గోడపై ఉన్న తన మిత్రుని పెళ్ళిఫోటో చూస్తూండి పోయాడు గుణశేఖర్. ‘అదేంటి బాబు అలా చూస్తున్నావ్.. ఆ ఫోటోలో ఉంది నా అల్లుడు కూతురు.. ఆ భగవంతుడు నాకు వాళ్ళను దూరం చేశాడు’ అంటూ గతం తలుచుకుని బాధపడుతుంది అన్నపూర్ణమ్మ. వెంటనే తేరుకుని ‘మీరు దీప నాన్నగారే కదా’ సందేహంగా అంది అన్నపూర్ణమ్మ గుణశేఖర్ తో. ‘అవునమ్మా దీప తండ్రినే’ ‘ఏదో ముఖ్య విషయం అన్నారు.. ఏంటి నాయనా’. ఆత్రుతగా అడిగింది అన్నపూర్ణమ్మ. ‘చెబుతానమ్మా ఇక్కడికి రాగానే, మరో నిజం తెలిసింది. తప్పు చేశానేమో అని అప్పుడప్పుడు బాధపడేవాణ్ణి కానీ ఈ మన కలయికతో ఆ బాధ నాకు దూరమవుతుందని ఇప్పుడే తెలిసింది. నా కుమార్తె దీప మీ మనవరాలు. నా కన్న కూతురు కాదు. ఆ.. రోజు నా మిత్రుడు.. అంటే కారుడ్రైవరయిన మీ అల్లుడు, కూతురు పాపతో సహా బహుశా మీ ఇంటికొస్తూనో ఏమో!.. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం సంభవించడం చేత వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. కాని 2 సం॥ లున్న దీప ఆ ప్రక్కనే ఉన్న గడ్డికుప్పపై పడుంది.. సరిగ్గా అదేసమయానికి నేను ఆసరిహద్దుల్లో ఉన్న మా ఆయిల్ మిల్ నుండి ఇంటికెళ్తున్నాను.. అంతకుముందే బిడ్డలు పుట్టక బాధపడుతున్న నేను నా భార్య.. ఓ అమ్మాయిని పెంచుకోవాలనుకున్నాము. ఆ తరుణంలోనే ఆ ఘోర పరిస్థితి చూసిన నేను, మరేం ఆలోచించక ఆ బిడ్డను తీసుకెళ్ళి ప్రాణంగా పెంచుకున్నాను. 5 సం|| క్రితమే నా భార్య కూడా అనారోగ్య కారణంగా మరణించింది. నిజానికి నా స్వార్థం కూడా ఉంది.. లేకుంటే దీపను ఎలాగయినా మీ ఆచూకి తెలుసుకొని మీకప్పగించేవాణ్ణి.. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ బిడ్డ నా ఇల్లు చేరిన తర్వాతే నాకింత ఆస్థి కలిసొచ్చింది.. ఏది ఏమైనా నేను చేసింది చాలా తప్పు నన్ను క్షమించండి’ అంటూ గతాన్ని గుర్తుచేసాడు గుణశేఖర్. ‘క్షమించడానికేముంది నాయనా అంతా మంచే చేశావు. మీ పెంపకంలో దీప ఏలోటు లేకుండా పెరిగింది.. అయినా.. మీకు మించిన తండ్రి ఈ లోకాన ఎవరుంటారు.. ఈ విధంగా కలుసుకోవడం అంతా ఆ దైవలీల’ అంటూ ఆశ్చర్యపూరిత ఆనంద బాష్చాలను విడుస్తూ అంది అన్నపూర్ణమ్మ. ఇంతలోనే
కాలేజీనుండి వచ్చిన సుమంత్ గుణశేఖర్ని చూసి ఆశ్చర్యానందంతో అతనికి నమస్కరిస్తాడు. అన్నపూర్ణమ్మ వాస్తవం కుమారునికి వివరిస్తుంది. దీప స్వయాన తన అక్క కుమార్తేనని, తెలుసుకున్న సుమంత్ హృదయం ఆనందంతో పరవశించిపోతుంది. వెంటనే వెళ్ళి అప్పుడేఫ్యాక్టరీ నుండి వచ్చిన దీపకు విషయం వివరిస్తాడు. దీప కూడా సుమంత్ స్వయాన తన మేనమామ అని మొదట ఆశ్చర్యపడి తరువాత వాస్తవాన్ని గ్రహించి సంతోషిస్తుంది.
సుమంత్ తన మావయ్య కుమార్తెను ప్రేమించి విఫలమైనా అనుకోని విధంగా దీప తో పరిచయం క్రొత్త ఆశల్ని రేకెత్తించింది. చివరికి ఆ దీప తన అక్క కుమార్తె అని తెలిసాక ఆనంద వినీలాకాశంలో తేలిపోయాడు. గతానుభవం నిరాశ నిస్పృహలకు గురిచేసినా ప్రస్తుతానుభవం మధురంగాను ఆశ్చర్యంగాను ఉంది సుమంత్కి. పేదరికంలో పెరిగిన సుమంత్ని ఇప్పుడు ఇంతటి సంపద వెంటాడిందంటే అది ఇతని పూర్వజన్మసుకృతమే.
కలిసొచ్చేకాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు పెద్దలు. ఇదేనేమో.. పెద్దలు మరొక మాట కూడా అన్నారు ‘అందని దానిని ఆశించడం కన్నా అందే దానిని గూర్చి ఆలోచించడం ఉత్తమమని’ సుమంత్ జీవితం ఈ మాటను ఋజువుచేసింది.
గుణశేఖర్ అన్నపూర్ణమ్మలు కొండంత మనసుతో ఆశీర్వదించగా గుణశేఖర్ గొప్ప మనసుకు అందరూ సంతసించగా అత్యంత వైభవంగా సుమంత్ దీపల వివాహం జరుగుతుంది. అప్పటినుండి ఈ కలిసొచ్చిన కాలం లో మధురస్మృతుల వినూతన జీవన యాత్ర సాగించ సాగారు దీప సుమంత్లు.
@శుభం@



