ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @
కొత్తగా బార్ లైసెన్సులకి తీసుకొచ్చిన పాలసీ విఫలం – 43.70 శాతం బార్లకే నేడు లాటరీ, మిగతా 56.30 శాతానికి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, గిట్టుబాటు కాదని ఆసక్తి చూపని వ్యాపారులు
ఏపీలో కొత్తగా బార్ లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చిన పాలసీ విఫలమైంది. మొత్తం 840 బార్లను నోటిఫై చేయగా 43.70 బార్లకే నేడు లాటరీ తీయనున్నారు. మిగతా 56.30 శాతానికి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం లైసెన్సు రుసుముల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతుంది.
రాష్ట్రంలో కొత్తగా బార్ లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చిన పాలసీ ప్రకారం ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే వాటిలోంచి లాటరీ తీసి లైసెన్సుదారును ఎంపిక చేయాలన్నది పాలసీలో ప్రధాన నిబంధన. మొత్తం 840 బార్లను నోటిఫై చేయగా శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 367 బార్లకే నాలుగు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మిగతా 473 బార్లకు లాటరీ తీసే అవకాశం లేదు. వాటికి నాలుగేసి దరఖాస్తులు వచ్చేవరకూ నోటిఫికేషన్ ఇస్తూనే ఉండాలి.
ఆసక్తి చూపని వ్యాపారులు:ఫలితంగా సగానికి పైగా బార్లు తెరుచుకోవు. దీంతో లైసెన్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని సర్కార్ కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. స్టేక్‌హోల్డర్స్ అభిప్రాయాలు, వినతులు పరిగణనలోకి తీసుకోకపోవడం, పాలసీ రూపకల్పనలో విశేష అనుభవమున్న అధికారుల సూచనలు, సలహాలు తీసుకోకుండా ఓ కన్సల్టెన్సీకే బాధ్యత అప్పగించేయడం వలనే బార్‌కు కనీస దరఖాస్తులు రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన పెట్టడం, 15శాతం అదనపు ఏఆర్‌ఈటీ తొలగించకపోవడంతో నూతన బార్ పాలసీ తమకు గిట్టుబాటు కాదని వ్యాపారులు దరఖాస్తులు వేయడానికి ముందుకు రాలేదు.
ప్రధానంగా క్వార్టర్ రూ.99కే లభించే మద్యాన్ని బార్లలో విక్రయించకూడదన్న నిబంధన, అదే విధంగా మద్యం దుకాణాల్లో పర్మిట్‌రూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో బార్ల కోసం దరఖాస్తులు వేయడానికి వ్యాపారులు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. గీత కార్మిక కులాల కోసం అదనంగా మరో 84 బార్లను నోటిఫై చేశారు. అందులో 80 బార్లకు నాలుగు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సాధారణ బార్ల కంటే వీటి దరఖాస్తు రుసుము, లైసెన్సు రుసుము 50 శాతం తక్కువ కావడంతో వాటికి పూర్తిస్థాయిలో దరఖాస్తులు రావడం గమనార్హం.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బార్లకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్‌కుమార్ చెప్పారు. 2019లో 517 2022లో పదకొండు వందల యాభై దరఖాస్తులు రాగా ఈ సారి 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన పెట్టామనీ, దాని ప్రకారం శనివారం ఉదయం ఆయా జిల్లాల్లో 367 బార్లకు లాటరీ తీసి లైసెన్సు జారీచేస్తామని తెలిపారు. గీత కార్మికులకు రిజర్వు చేసిన దాదాపు 84 బార్లలో 80 బార్లకూ శనివారమే లాటరీ తీస్తామని అధికారులు వెల్లడించారు.


