సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @
ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ చిత్రపటాలను ప్రదర్శిస్తున్నారంటూ హైకోర్టులో పిల్ – చిత్రపటాలు తొలగించాలంటూ పిటిషనర్ అభ్యర్థన
చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలతో హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని పిల్లో పేర్కొన్నారు.
పిల్ దాఖలు చేసిన వ్యక్తి వివరాలు: ఈ పిల్‌ను రైల్వే విశ్రాంత ఉద్యోగి, విజయవాడకు చెందిన వై. కొండలరావు దాఖలు చేశారు. ఆయన తన పిటిషన్లో ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాలను ప్రదర్శించడంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట విధానం రూపొందించలేదని స్పష్టం చేశారు. చిత్రపటాల ప్రదర్శన విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట విధానాన్ని తీసుకొచ్చేంత వరకు పవన్ కల్యాణ్ ఫోటోలను తొలగించేలా ఆదేశించాలని కోరారు.
ప్రతివాదుల జాబితా: ఈ కేసులో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార, పౌరసంబంధాలశాఖ డైరెక్టర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ పిల్‌పై బుధవారం విచారణ జరపనుంది.
ఆర్టీఐ సమాధానాలు: పిల్ దాఖలు చేసిన కొండలరావు, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాల ప్రదర్శనకు సంబంధించిన ఉత్తర్వులు, నిబంధనలు, సర్క్యులర్లు వివరాలు కోరుతూ దరఖాస్తులు వేశారు. దీనికి సమాధానంగా సమాచార, పౌరసంబంధాలశాఖ “ప్రస్తుతం ఈ అంశంపై ఎలాంటి జీఓలు, మార్గదర్శకాలు, నిబంధనలు లేవు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల చిత్రపటాలను ప్రదర్శించమని ప్రభుత్వం కార్యాలయాలకు ఆదేశాలు ఇవ్వలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు ఈ విషయమై ఏ సమాచారం లభ్యం కాలేదు” అని తెలిపింది.
రాజ్యాంగపరమైన ప్రశ్నలు: కొండలరావు తన పిటిషన్లో, రాజ్యాంగంలోని అధికరణ 164లో ఉప ముఖ్యమంత్రి అనే పదవిని స్పష్టంగా ప్రస్తావించలేదని గుర్తు చేశారు. అందులో సీఎం, ఇతర మంత్రులను గవర్నర్ నియమించే అంశం మాత్రమే ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చిత్రపటం పక్కన ఉప ముఖ్యమంత్రి ఫొటో ఉంచడం వల్ల ఈ రెండు పదవులు రాజ్యాంగపరంగా సమానం అనే తప్పుడు భావన కలుగుతుందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు: రాజ్యాంగబద్ధం కాని(నాన్ కాన్స్టిట్యూట్) ఉప ముఖ్యమంత్రి పోస్టును సీఎం స్థాయి పోస్టుగా పెద్దది చేసి చూపుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రాజకీయ నేతలను కీర్తించేందుకు ప్రజాధనాన్ని వినియోగించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా పిటిషనర్ తన పిల్లో ప్రస్తావించారు. ప్రజాధనం ఉపయోగించి రాజకీయ వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టను పెంచడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పిటిషనర్ అభ్యర్థన: ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వం నిర్దిష్ట విధానం రూపొందించేంత వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్రపటాలను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో హైకోర్టును కోరారు.


