మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన డా. నల్లాని
తెలుగు రాష్ట్రాల్లో 50 సంవత్సరాలకు పైగా విశేషసేవలందిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్.డీ.టి) మళ్లీ విదేశీ నిధులను పొందేలా అనుమతులను పునరుద్ధరించడం పట్ల ప్రముఖ సామాజికవేత్త, రచయిత్రి, కేంద్ర ప్రభుత్వ ‘రాజ్య మహిళా సమ్మాన్’ అవార్డు గ్రహీత డాక్టర్ నల్లాని రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. లక్షలాదిమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించేలా ప్రత్యేకకృషి చేసి, ఎఫ్.సీ.ఆర్.ఏ రెన్యూవల్ సాధించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు డా. నల్లాని ధన్యవాదములు తెలిపారు. ప్రజల జీవితాల్లో కీలక భాగమైన ఆర్డీటీ సేవలు ఇకపై యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ సేవలు నిరంతరాయంగా అందేలా చూడాలని మాట ఇచ్చిన మంత్రి లోకేష్ తన మాటను నెరవేర్చాడని ఆమె ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపుల్లో, పేదల ఇళ్లలో వెలుగు నింపడం, నిరుపేద పిల్లల విద్య, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత, వైద్య సేవలందించడంలో ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న విశేష కృషిని లోకేష్ వివరించడం అభినందనీయమన్నారు. ఆర్డీటీకి ఉన్న అడ్డంకులు తొలగిపోయి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్.సీ.ఆర్.ఏ) ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అధికారులందరికీ డాక్టర్ నల్లాని రాజేశ్వరి ధన్యవాదములు తెలిపారు. అనేక దశాబ్దాలుగా సేవాస్ఫూర్తితో పనిచేస్తున్న ఆర్డీటీ నిర్వాహకులు అన్నే ఫెర్రర్, మాంచో ఫెర్రర్, విశా ఫెర్రర్ తదితరులకు డాక్టర్ నల్లాని రాజేశ్వరి ప్రత్యేక అభినందనలు తెలిపారు.



