జగ్గయ్యపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆధార్ కార్డు సెంటర్ లో సర్వసాధారణ ప్రజలను దోచుకునే విధంగా అక్రమంగా వసూళ్లు జరుగుతు న్నాయన్న ఆరోపణలు వెల్లడి చేస్తున్నాయి. ఆధార్ కార్డ్ అప్డేట్కు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు భిన్నంగా, ₹150 వరకు వసూలు చేస్తూ, ఎలాంటి రిసిప్ట్ ఇవ్వకుండా, విధిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ప్రజలను వేధిస్తున్న తీరుపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సిబ్బంది, అప్డేట్ కోసం వచ్చిన వారిని 2-3 గంటలపాటు వేచి ఉండాలని చెబుతూ, ప్రశ్నించిన వారిని “ఉండు లేకపోతేవెళ్ళిపో” అంటూ బెదిరిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. మరింత ఆశ్చర్యకరం ఏంటంటే, ఏ సేవకు ఎంత చార్జ్ అని పేర్కొనబడిన బోర్డు కూడా అక్కడ కనబడడం లేదు.
కూలీలుగా పనిచేసేవారు, చిన్న చిన్న వ్యాపారులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధంగా వేధింపులకు గురవు తుండగా, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. MRO ను ఫోన్లో సంప్రదించగా స్పందించకపోగా, RDO ను కలిసిన తర్వాత సంబంధిత అధికారులను పంపించి విచారణ చేపడతానని హామీ ఇవ్వడం కొంత ఊరటనిస్తోంది.
ప్రజలు డిమాండ్ చేస్తున్నారు – ఇలాంటి అక్రమ కేంద్రాలను వెంటనే మూసివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకో వాలని. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఈ దోపిడీకి సంబంధించి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరం.
ప్రజలకు విజ్ఞప్తి:
ఎవరైనా ఆధార్ అప్డేట్ కేంద్రం లో అక్రమ వసూళ్లకు గురైతే, UIDAI అధికారిక వెబ్సైట్ లేదా హెల్ప్‌లైన్ (1947) ద్వారా ఫిర్యాదు చేయాలి. తీసుకునే డబ్బులకు రిసిప్ట్ ఇవ్వకపోతే, అది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన.


