విశాఖపట్నం, అక్టోబర్ 12 (పున్నమి ప్రతినిధి)
గెలుపు–ఓటములు ఒకేలా చూడండి, కుటుంబం–గురువుల నమ్మకాన్ని నిలబెట్టండి : పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి
క్రీడా స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి తెలిపారు. చిత్తశుద్ధితో క్రీడాకారులుగా ఎదిగి తల్లిదండ్రులు, గురువులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.
విశాఖలోని శ్రీ మన్మధరావు మెమోరియల్ క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న ప్రారంభమైన బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ టోర్నమెంట్‌లో ఓర్ప్రిడ్జ్ ఇంటర్నేషనల్ గర్ల్స్ టీమ్ విజేతగా నిలవగా, సెయింట్ అల్లోయిసిస్ స్కూల్ విద్యార్థులు రన్నరప్ ట్రోఫీ అందుకున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ స్కూల్ విద్యార్థుల టీమ్, తిమ్మాపురం విజ్ఞాన్ విద్యార్థులు ప్రత్యేక ట్రోఫీలు పొందారు.
కార్యక్రమంలో డా. బాగ్చి మాట్లాడుతూ,
> “బాస్కెట్‌బాల్ క్రీడ గొప్పది. భారతదేశంలో ఈ క్రీడను టాప్ స్థాయికి తీసుకెళ్లే దిశగా కృషి చేయాలి,” అని క్రీడాకారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఐ టెక్నాలజీతో దేశంలోనే మొదటిసారిగా పాట సృష్టించి సంచలనం సృష్టించిన అడ్డూరి సునీల్ చరణ్, ప్రభుత్వ పి.ఇ.టి లలిత్ కుమార్, డా. రవి, డా. కళ్యాణ్ చక్రవర్తి, క్లబ్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
గత 19 ఏళ్లుగా ఉచితంగా బాస్కెట్‌బాల్ శిక్షణ అందిస్తున్న అన్నెపు రామచందర్ మాట్లాడుతూ, తాను అందిస్తున్న ఉచిత శిక్షణకు ఆంధ్రా యూనివర్సిటీ క్రీడా విభాగం అందిస్తున్న ప్రోత్సాహాన్ని గుర్తుచేశారు.
పి.ఇ.టి డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్, డా. ఎ. పల్లవి (ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్ విభాగాధిపతి) సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కార్యక్రమాన్ని బి.ఎస్. చంద్రశేఖర్ మాస్టర్ ఆఫ్ సెర్మనీగా నిర్వహించారు. చెలమరెడ్డి మహేష్, చంద్రశేఖర్, సూరిబాబు పొట్నూరు, శివకుమార్, బోర వెంకటేశ్వరరెడ్డి తదితరులు టోర్నమెంట్ విజయవంతం కోసం కృషి చేశారు.


