రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలం లోని పోతుగల్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటుకలు ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్ పోతుగల్ గ్రామంలోని రాముల వారి గుడి వెనుక భాగంలో అకస్మాత్తుగా అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ట్రాక్టర్లో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన నందు కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బురదలో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


